విశాఖ అర్బన్ జిల్లా రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ఓ విలక్షణమైన పాత్ర. ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడమే కాదు జిల్లాను శాసించేలా బలంగా ఎదిగారు. ఇందుకు ఆయన వ్యూహాలతో పాటు, సామాజిక బలం బాగా కలసివచ్చాయి. ఇరవయ్యేళ్ళ గంటా రాజకీయ జీవితం ఎదురులేకుండా గడచింది. ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా గెలుపు ఖాయంగా సాగింది. ఇపుడు గంటా విశాఖ ఉత్తరం  నుంచి పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ పట్టు దొరుకుతుందా అన్నది రాజకీయంగా తలపండిన గంటాకే అర్ధం కాని పరిస్థితి ఉంది. విషయానికి వస్తే గంటా మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్ దాఖలు చేశారు.


ప్రచారానికి గట్టిగా పదిహేను రోజుల టైం కూడా లేదు. అయితే గంటా ప్రచారం మీద ఓ కన్నేస్తూనే మరో వైపు నియోజకవర్గంలోని నాయకులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు/  దాంతో ఆయనది ఇపుడు ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా పరిస్థితి అయింది. మంత్రిగా ఉన్నపుడు తన ఇంటి ముంది క్యూ కట్టించుకున్న నాయకుల ఇళ్ళకే గంటా ఇపుడు వెళ్ళాల్సివస్తోంది. వారి కోసం ఇపుడు ఆయన ఎదురుచూడాల్సివస్తోంది. ఓట్ల వేట కోసం ఇది తప్పదు అని ఎంత సర్దుకున్నా మంత్రి గారికి మాత్రం ఈ అగచాట్లు చికాకుగానే ఉంటున్నాయట.


ఇక విశాఖ ఉత్తరం సీటు తనకే కన్ ఫర్మ్ అని గట్టిగా భావించి గత కొంతకాలంగా ఓ రేంజిలో ప్రచారం చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వాతి క్రిష్ణా రెడ్డి సీటు రాకపోవడంతో బాగా డల్ అయ్యారట. ఇక ఆయన పార్టీ కార్యకలాపాల్లో కూడా పాలుపంచుకోకుండా సైలెంట్ అయ్యారట. దాంతో ఆయన మద్దతు కోసం గంటా ఏకంగా ఇంటికే వెళ్ళి కలిసారు. మంత్రి ఇలా తన ఇంటికే వచ్చేసరికి క్రిష్ణా రెడ్డికి మరేం తోచింది కాదట. నీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం, ఈసారికి నన్ను గట్టెక్కించు అంటూ గంటా వేడికోలు రెడ్డి గారిని ఎంతవరకూ కదిలిస్తుందో తెలియదు కానీ ఇలా ఎక్కే గుమ్మం దిగే గుమ్మతో మంత్రి పడుతున్న పాట్లు చూసి క్యాడర్ మాత్రం ముక్కున వేలేసుకుంటోంది.


 ఇక తమకే టికెట్ ఇవ్వాలని, నాన్ లొకల్ ని పెట్టరాదని అనేక విన్నపాలు పెట్టుకున్నా గంటాకి టికెట్ ఇవ్వడం పట్ల అలిగిన తమ్ముళ్ళని బతిమాలుకునే బిగ్ ప్రోగ్రాం ని గంటా పెట్టుకున్నారు. వారి అండదండలు లేకపోతే గంటా ఈసారి గెలవడం కష్టమేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: