తెలుగుదేశంపార్టీ తరపున నామినేషన్లు వేసిన ప్రముఖుల్లో కొందరి నామానేషన్ల విషయంలో హై డ్రామాలు మొదలయ్యాయి. అనంతపురం జిల్లాలోని  రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు, గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నామినేషన్ వేసిన నారా లోకేష్, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో సుగుణమ్మ, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరంలో శ్రీనివాస్ నామినేషన్లో తప్పులున్నాయంటూ ప్రత్యర్ధులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేయలేదు కాబట్టి వాటిని తిరస్కరించాలని వైసిపి, స్వతంత్ర అభ్యర్ధులు గట్టిగా పట్టుబడుతున్నారు.

 

రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు  వేసిన నామినేషన్ పై హై డ్రామా నడుస్తోంది. నామినేషన్ పత్రాల్లో అన్నింటిపైనా సంతకాలుండాలి. అలాగే అందచేయాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వటంతో పాటు ఎక్కడా కొట్టివేతలుండకూడదు. కానీ మంత్రి వేసిన నామినేషన్లో ఒక పేజీలో కొట్టివేతులున్నాయట. అలాగే మరో పేపర్లో కొన్ని కాలంలను మంత్రి నింపకుండానే నామినేషన్ వేసేశారట.

 

ఈరోజు స్క్రూటిని మొదలైనపుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి  ఆ విషయాన్ని గుర్తించారు. వెంటనే అదే విషయమై వైసిపి అభ్యర్ధి కాపు రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారట.  నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా మంత్రి కాల్వ నామినేషన్ ను తిరస్కరించాలని కాపు గట్టిగా పట్టుబడుతున్నారు. దాంతో అక్కడ పెద్ద గొడవ నడుస్తోంది.

అలాగే, లోకేష్ నామినేషన్లో కూడా తప్పులున్నాయట.  ఎన్నికల అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలపై లోకేష్ తరపున లాయర్లు 24 గంటల సమయం ఇవ్వాలని కోరుతున్నారట. అలాగే తిరుపతిలో సుగుణమ్మ ఫారం 7, 7 ఏ దాఖలు చేయలేదు కాబట్టి ఆ నామినేషన్ ను కొట్టేయాలంటూ స్వతంత్ర అభ్యర్ధి విజయకుమార్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఇక పోలవరం అభ్యర్ధి శ్రీనివాస్  కుల ధృవీకరణ తప్పుడుదంటూ ప్రత్యర్ధులు పట్టుబడుతున్నారట. మరి ఎన్నికల అధికారులు ఏం చేస్తారో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: