ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర్‌రావుపై వేటు వేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. హెడ్‌క్వార్టర్స్‌కు సరెండర్‌ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి ఎన్నికల విధులు వెంకటేశ్వర్‌రావుకు అప్పగించొద్దని ఆదేశించింది. అలాగే శ్రీకాకుళం, కడప ఎస్పీలపై కూడా వేటు పడింది. ఎన్నికల సంఘం ఇద్దరు ఎస్పీలను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసింది.


ఏబీ వెంకటేశ్వర్‌రావు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని..పలు దఫాలుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. వైసీపీ ఫిర్యాదుపై విచారణ జరిపి ఈసీ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ డీజీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈసీ నిర్ణయంపై సమీక్ష చేస్తున్నారు. కొత్త ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నియామకంపై కసరత్తు చేస్తున్నారు. సీనియర్‌ అధికారుల జాబితా తయారు చేసి డీజీపీ ఈసీకి పంపనున్నారు. ఈసీ నిర్ణయం మేరకు ఏపీ సీఎస్‌.. కొత్త ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను నియమించనున్నారు.


కాగా ఇంటెలిజెన్స్‌ను త‌న గుప్పిట్లో పెట్టుకొని అవ‌కత‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఈ నిర్ణ‌యం షాక్ వంటిద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంటెలిజెన్స్ అండ‌తో ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయాల‌నుకున్న ప‌చ్చ‌పార్టీ ఎత్తుగ‌డ‌ల‌కు చెక్ ప‌డ్డ‌ట్లేన‌ని ఈ నిర్ణ‌యంపై వైసీపీ స్పందించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: