ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబునాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. చంద్రబాబుకు అన్నీ తానై వ్యవహరిస్తున్న ఇంటెలిజిన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును హఠాత్తుగా బదిలీ చేసింది. ఇంటెలిజిన్స్ చీఫ్ బదిలీని చంద్రబాబు ఏమాత్రం ఊహించలేదు. చీఫ్ తో పాటు మరో ఇద్దరు జిల్లాల ఎస్పీలను కూడా ఈసి బదిలీ చేయటం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి వెంకటేశ్వరరావు దాదాపు అధికార పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారని వైసిపి ఆరోపిస్తోంది.  ఎంఎల్ఏలు, ఎంపిల ఫిరాయింపుల వ్యవహారంలో కానీ వైసిపి ప్రజా ప్రతినిధులను వేధింపుల్లో కానీ వెంకటేశ్వరరావుదే ప్రధాన పాత్రగా వైసిపి మండిపోతోంది. టిడిపిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పోలీసులు ఎదురు కేసులు పెట్టి వేధించటంలో వెంకటేశ్వరరావే తెరవెనుక నుండి కథ నడిపిస్తున్నారంటూ వైసిపి నేతలు ఎన్నోమార్లు మొత్తుకున్నారు. అయినా ఉపయోగం లేకపోయింది.

 

ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న దగ్గర నుండి వైసిపి నేతలపై కేసులు ఎక్కువయ్యాయి. వైసిపి అభ్యర్ధుల వాహనాలను చెక్ చేసే పేరుతో గంటల పాటు ప్రచారం చేయనీకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలున్నాయి. అదే సమయంలో టిడిపి నేతల వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నారని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పట్టించుకోవటం లేదు. సో, ఈ విషయలన్నింటిపైనా మంగళగిరి వైసిపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.

 

ఆళ్ళ ఫిర్యాదును పరిశీలించిన ఈసి వెంటనే వెంకటేశ్వరరావుతో పాటు కడప ఎస్పీ రాహూల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను ఎన్నికల విధుల నుండి తప్పించింది. ఇంకా మరింకొందరు ఐపిఎస్ అధికారుల బదిలీలు తప్పవని సమాచారం. ఏదేమైనా వెంకటేశ్వరరావు బదిలీ అన్నది చంద్రబాబుకు పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: