మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. డేటా చౌర్యం విషయంలోనూ ఏపీ పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం సరిగ్గా ఎన్నికల పోలింగ్‌కి 15 రోజుల ముందు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు వేసింది. మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారుల్నీ బదిలీ చేసింది. దాంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడింది.


ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్‌ విభాగంపై చాలా ఆశలే పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మార్పుతో ఒక్కసారిగా అధికార పార్టీలో కుదుపు వచ్చినట్లయ్యిందన్నది సర్వత్రా జరుగుతోన్న చర్చ. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మీద హత్యాయత్నం జరిగిందంటే.. అది పూర్తిగా ఇంటెలిజెన్స్‌ వైఫల్యం కిందనే లెక్క. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీమంత్రి కూడా అయిన వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారంటే.. ఇక్కడా ఇంటెలిజెన్స్‌ వైఫల్యం సుస్పష్టం.


చెప్పుకుంటూపోతే చాలానే వున్నాయి. అన్నట్టు వైఎస్‌ వివేకా హత్యకేసు విషయంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మపై ఆరోపణలు వెల్లువెత్తాయి ఇప్పుడాయన మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటువేసింది. ఇదిలావుంటే, డీజీపీపైనా కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసినా, ఆ విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించినట్లు కన్పించడంలేదు. ఎలాగైతేనేం, ఎన్నికల ముందర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మార్పు అధికార పార్టీకి ఎదురుదెబ్బే. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కారు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని ఇప్పటికే చాలా సార్లు విమర్శలు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: