విశాఖలో ఎంపీ అభ్యర్ధుల నాన్ లోకల్ వ్యవహారం చిత్రంగా ఉంది.  మొత్తానికి మొత్తం అన్ని పార్టీలు కూడా కోరి మరీ నాన్ లోకల్ అభ్యర్ధులను బరిలోకి దింపాయి. ఎన్నికల వేళ సూట్ కేసులతో దిగిన దిగుమతి సరుకు అన్నది కూడా అందరికీ తెలిసిందే. అయితే తాము పక్కా లోకల్ అంటున్నారు ఎంపీ అభ్యర్ధులు. అదే చిత్రం మరి. అమ్మ తోడు నేను వైజాగోణ్ణే, నమ్మండి అంటున్నారు. 


జనసేన తరఫున విశాఖ ఎంపీ బరిలో ఉన్న మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అందరి కంటే నాలుగాకులు ఎక్కువే చదివారు. మా అమ్మ కడుపులో ఉండగానే నేను విశాఖ వాసిని అంటున్నారు. అప్పట్లో తన తండ్రి బదిలీ అయి విశాఖ వచ్చినపుడు తనను కడుపులో మోస్తూ తన తల్లి  ప్ప్ మారు విశాఖ వచ్చిందని ఆ విధంగా తాను పుట్టకముందే విశాఖ వచ్చానని ఆయన  కొత్త పాయింట్ చెప్పి మరీ పక్కా లోకల్ అనేస్తున్నారు.


ఒకసారి తనకు ఓటేసి గెలిపించారు   కాబట్టి తాను విశాఖ మనిషిని అయిపోయాయని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధిని దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు. తనకు విశాఖలో బంధువులు వున్నారని, వచ్చీ పోతూ ఉంటాని కాబట్టి తానెందుకు నాన్ లోకల్ అవుతానని ఆమె లాజిక్ పాయింట్ తీస్తున్నారు. అదే విధంగా తాను పుట్టింది వేరే ప్రాంతం అయినా వ్యాపారం అంతా విశాఖలోనే కాబట్టి తానే అసలు సిసలు విశాఖ వాసినని వైసీపీ అభ్యర్ధి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. తాను ఎక్కడికీ తిరిగి వెళ్ళిపోనని, సూట్ కేసులతో తాను దిగి రాలేదంటూ మిగిలిన వాళ్ళపై సెటైర్లు వేస్తున్నారు.


ఇక తన తాత ఎంవీవీఎస్ మూర్తి గీతం విద్యా సంస్థలను విశాఖలో పెట్టారని, ఆ విధంగా తాము విశాఖ వాసులం ఎపుడో అయిపోయామని టీడీపీ ఎంపీ అభ్యర్ధి శ్రీ భరత్ అంటున్నారు. తాము ఇక్కడే నివాసం  ఉంటామని, విశాఖను అభివ్రుధ్ధి చేసేందుకే వచ్చామని అంతా గట్టిగానే చెబుతున్నారు. మరి ఈ పక్కా లోకల్ బ్యాచ్ ఎన్నికల వేళ మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారని ఎవరూ అడగకూడదు,  గెలిచినా ఓడినా మళ్ళీ జనం ముందుకు వస్తారా అని కూడా అసలు అడగకూడదు. ఎందుకంటే వారంతా పక్కా లోకల్ మరి. ఇంతకీ  నాన్ లోకల్ ఎవరయ్యా అంటే ఓట్లేస్తున్న విశాఖ వాసులే. ఎన్నికల్లో ఎన్నో అందమైన వాగ్దానాలు, హామీలు ఇచ్చే వారిని చూసిన ఓటర్లు ఈ కొత్తరకం  లోకల్ గ్యాంగ్ ని వారి స్టోరీలను చూసి ఖంగు తింటున్నారంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: