విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు తీరు ఇపుడు చర్చగా ఉంది. ఆయన తనకు సాటి అభ్యర్ధులు ప్రత్యర్ధులు ఏమీ కాదనుకుంటున్నారు. ముఖాముఖీకి వారితో రానంటున్నారు. ఇక ప్రచారం పెద్దగా చేయకుండానే గెలిచేస్తానని ధీమాగా ఉన్నారు.   ఇప్పటివరకూ వరసగా అన్ని ఎన్నికలలో గెలిచిన గంటా వారు ఓటమెరుగని వీరుడన్న పేరు తెచ్చుకున్నారు. దాంతో ఎక్కడైనా ఎవరితోనైనా నేనే  విజేతను అంటూ ఓవరాక్షన్ చేస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి.


కారు దిగకుండానే ప్రచారం చేస్తున్నారు. ఏసీ కారు, చలువ కళ్ళద్దాలు, నలగని  డ్రస్, చెదరని క్రాఫ్ ఇదీ గంటా మార్క్ ప్రచారం. ఓ వైపు పార్టీల అధినేతలతో పాటు, అభ్యర్ధులు కూడా  సైతం పొగలు సెగలూ కక్కుకుంటూ మండే ఎండల్లో ప్రచారం చేస్తూంటే గంటా వారు మాత్రం నేనే గెలుస్తాను అన్న మితిమీరిన  ధీమాతో మొక్కుబడి ప్రచారం చేస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గంటా ఈసారి పోటీ చేస్తున్నారు. అక్కడంతా కొండవాలు ప్రాంతాలు ఎక్కువ. ఓటర్లు కూడా  పెద్ద ఎత్తున అక్కడే ఉన్నారు. అయితే గంటా మహాశయుడు మాత్రం ఆ కొండవాలు ప్రాంతాలకు వెళ్ళనంటే  వెళ్ళనంటున్నారుట.


తన కారు అక్కడికి పోదు కాబట్టి రోడ్డున్న ప్రాంతాల్లోనే అరకొర ప్రచారం కానిచ్చేసి ఇంటికి చక్కా వచ్చేస్తున్నారట. కొన్ని సందర్భాలలో కొండ వాలు ప్రాంతాలు, ఇరుకు సందుల్లోకి తిప్పాలనుకున్న క్యాడర్ పైన గంటా అగ్గి మీద గుగ్గిలమే అవుతున్నారట. కారు వెళ్ళని ప్రాంతాలకు ఎందుకు పిలుస్తున్నారంటూ గంటా సార్  ఓ లెక్కలో క్లాస్ పీకేస్తున్నారట. దీని మీద ప్రత్యర్ధి పార్టీలు ఓ రేంజిలో మండిపడుతున్నాయి.  ప్రచారం కోసం యాభై అడుగులు దూరం కూడా నడవని మంత్రి గారిని ఎందుకు గెలిపించాలంటూ వైసీపీ అభ్యర్ధి కేకే రాజు నిలదీస్తున్నారు. 


అయిదేళ్ళకు మారు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడం కోసం కూడా కారు దిగని, ఓటర్ల సిట్టింగ్  దగ్గరకు రాని వారిని గెలిపిస్తే మళ్ళీ ఓటర్ల ముఖం చూస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బుతోనే  గెలవాలనుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు. గంటాను గెలిపిస్తే అవినీతి తప్ప అభివ్రుధ్ధి ఉండదని కూడా అంటున్నారు. మొత్తానికి గంటా మాస్టార్ కారు లో షికార్ ప్రచారం ప్రత్యర్ధి పార్టీలకు భలే అస్త్రంగా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: