తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు యాగాల‌పై ఎంత న‌మ్మ‌కం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని. తెలంగాణ రాష్ట అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యక్రమాలన్నీ పరమేశ్వరుడి దయతో దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ రాజ‌శ్యామ‌ల‌ యాగం చేశారు. విశాఖ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ  స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలోనే ఈ యాగం జరిగింది. తాజాగా అదే స్వామీజీ ఆధ్వ‌ర్యంలో వైసీపీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కోసం యాగం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.


నెల్లూరు కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో 27న ప్రారంభమైన  యాగం 29న‌ పూర్ణాహుతితో ముగిసింది. విశాఖ శ్రీశారదాపీఠాధీశ్వరులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో యాగం జరిగింది. ఈ యాగానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఆయనకు చెందిన వీపీఆర్‌ కన్వెన్షన్‌లోనే శాస్త్రోక్తంగా క్రతువు పూర్తి చేశారు.  మహాకాళి, మహలక్ష్మి, మహా సరస్వతి అంశలతో కూడిన శ్రీరాజశ్యామల దేవీకి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 3 రోజుల పాటు యాగం నిర్వహించారు. ఈ యాగస్థలికి సాధారణ వ్యక్తులు ఎవరినీ అనుమతించ లేదు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి.. పకడ్బందీగా పూర్తి చేశారు. 


 జగన్‌ సీఎం కావాలన్న లక్ష్యంతో తలపెట్టిన యాగం ఈ ఉదయం 10గంటల 26 నిమిషాలకు పూర్ణాహుతితో ముగిసింది. జగన్ గతంలోనూ పలుమార్లు స్వరూపానందేంద్ర స్వామిని కలిసారు. ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌ కోసం స్వరూపానందేంద్ర స్వామి రుషికేశ్ లో పలు విశేష పూజలు, యాగాలు ఇప్పటికే చేశారు. ఇప్పుడు శ్రీ రాజశ్యామల సహిత రాజ్యప్రద ఇంద్ర యాగము కూడా జరిపించారు. జగన్ సీఎం అవుతారన్న బలమైన విశ్వాసంతో ఈ యాగం జరుగుతుండడం.. వైసీపీ నేతల్లోనూ ఉత్సాహం నింపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: