చంద్రబాబునాయుడుకి ప్రత్యర్ధులు ఎంతమందున్నా ముందు వరసలో ఉండే వారిలో గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నాని కూడా ఒకరు. అందులోను కృష్ణా జిల్లాలోని వైసిపి నేతల్లో నాని లాంటి ప్రత్యర్ధి చంద్రబాబుకు ఇంకోరుండరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నానిపై చంద్రబాబు ప్రత్యేకంగా టార్గెట్ పెట్టారు.  రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కొడాలిని ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. అందుకనే నానిపై అంతలా విరుచుకుపడ్డారు.

 

ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా చంద్రబాబు గుడివాడలో మాట్లాడారు. ఐదేళ్ళల్లో గుడివాడకు తమ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పకుండా ఎక్కువ భాగం కొడాలిపై విరుచుకుపడటంతోనే గడిపేశారు. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏ పార్టీలో ఎంఎల్ఏ అయ్యాడు అంటూ విరుచుకుపడ్డారు. పైగా పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తా కాదా ? అంటూ నాని గురించి జనాలను ఉసిగొలిపారు.

 

నిజానికి కొడాలి రెండుసార్లు ఎంఎల్ఏ అయ్యింది టిడిపిలోనే అయినా తర్వాత పార్టీకి  రాజీనామా చేసి వైసిపిలో చేరారు. తర్వాత ఎన్నికల్లో వైసిపి నుండి గెలిచారు. వాస్తవం ఇదైతే కొడాలి టిడిపికి చేసిన ద్రోహం ఏమిటో అర్ధం కావటం లేదు. చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించినట్లు కొడాలి ఏమీ టిడిపిలో నుండి వైసిపిలోకి ఎంఎల్ఏగా ఫిరాయించలేదు. కాకపోతే కొడాలిని దెబ్బ కొట్టగల నేత టిడిపిలో లేకపోవటమే చంద్రబాబుకు ఇబ్బందిగా తయారైంది. ఇప్పటికైతే కొడాలిని ఎదుర్కొనే ధీటైన నేత టిడిపిలో లేరన్నది వాస్తవం. ఎప్పుడూ జనాల్లోనే ఉండే కొడాలి బలమైన నేతగా ఎదిగారు.

 

నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని దేవినేని అవినాష్ ను చంద్రబాబు ఏరికోరి గుడివాడలో పోటికి దింపారు. అవినాష్ ను స్ధానికులు వ్యతిరేకిస్తున్నా వినకుండా అవినాష్ నే పంపారు పోటీ చేయమని. దాంతో ప్రచారంలో అవినాష్ నానా అవస్తలు పడుతున్నారు. చూడబోతే స్ధానిక టిడిపి నేతలే కొడాలిని గెలిపించేట్లున్నారు. పార్టీలోని సమస్యలను పరిష్కరించకుండా కొడాలిని టార్గెట్ చేస్తే ఉపయోగం ఏమీ ఉండదన్న విషయం చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.

 

నిజానికి ఐదేళ్ళలో నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది లేదు. నియోజకవర్గంపై చంద్రబాబు దృష్టి కూడా పెట్టలేదు. పోనీ ఎన్టీయార్ కుటుంబసభ్యులైనా దృష్టి పెట్టారా అంటే అదీ లేదు.  అంటే నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, స్ధానిక నేతలను బలోపేతం చేయకుండా టిడిపి అభ్యర్ధి గెలవాలంటే  ఎలా గెలుస్తారు ? కొడాలిపై మండిపడితే ఏమొస్తుంది ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: