రామ్ గోపాల్ వర్మ తీసిన ఎన్టీయార్ బయోపిక్ ’లక్ష్మీస్ ఎన్టీయార్’ అంటే చంద్రబాబునాయుడు ఎందుకంతగా భయపడుతున్నారో అర్ధం కావటం లేదు. శుక్రవారం రిలీజవ్వాల్సిన బయోపిక్ తెలంగాణాలో రిలీజవ్వగా ఏపిలో మాత్రం వాయిదా పడింది. చివరి నిముషంలో బయోపిక్ రిలీజ్ ను ప్రభుత్వమే అడ్డుకుంది. దాంతో లక్ష్మీస్ ఎన్టీయార్ బయోపిక్ విషయంలో  ప్రభుత్వం అంటే చంద్రబాబునాయుడు భయపడుతున్నారనే ప్రచారం పెరిగిపోయింది.

 

సరే బయోపిక్ లో ఏముంది ? చూపిందంతా వాస్తవమేనా ? బయోపిక్ ను  ఎవరి కోణంలో చూపించారు ? అన్న విషయాలను పక్కన పెట్టేద్దాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచింది మాత్రం చంద్రబాబే. ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి వెన్నుపోటు విషయాన్ని ఇపుడెంతగా మాట్లాడుకున్నా ఉపయోగం లేదు.

 

వెన్నుపోటు ఘటననే హైలైట్ చేస్తు వర్మ తీసిన బయోపిక్ రిలీజ్ ను అడ్డుకోవటం వల్లే ఆ సినామాకు అంత క్రేజ్ వస్తోంది. నిజానికి బయోపిక్ ను అడ్డుకుని చంద్రబాబు తప్పు చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే, ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచినపుడే చంద్రబాబుకు వ్యతిరేకంగా జనాలు స్పందించలేదు. అలాంటిది అదే నేపధ్యంలో ఓ బయోపిక్ తీస్తే ఇపుడెందుకు ఉలికిపడుతున్నారో అర్ధం కావటం లేదు. ?

 

1994 లో టిడిపిని  జనాలు అఖండ మెజారిటీతో గెలిపించారు.  తర్వాత ఏడాదికే ఎన్టీయార్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సిఎం పీఠాన్ని లాక్కున్నారు. వెన్నుపోటు ఉదంతంలో అందరూ చంద్రబాబును మాత్రమే బూచిగా చూడటం తప్పు. ఎందుకంటే, కడుపున పుట్టిన సంతానానికే తండ్రి ఎన్టీయార్ అంటే  ప్రేమ లేనపుడు అల్లుడుకి మాత్రం ఎందుకుంటుంది ?

 

ఎన్టీయార్ కు రెండో అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటే కొడుకులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణతో పాటు కూతుళ్ళు దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రత్యక్ష సహకారం ఉంది. మిగిలిన కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళ పరోక్ష సహకారం కూడా అందింది కాబట్టే వెన్నుపోటు ఎపిసోడ్ లో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.

 

వెన్నుపోటులో సక్సెస్ అవ్వటమే కాకుండా తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. 1996లో పార్లమెంటు ఎన్నికల ముందు ఎన్టీయార్ మరణించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు 22 సీట్లు వస్తే చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి 16 నియోజకవర్గాల్లో గెలిచింది.

 

అంటే ఎన్టీయార్ వెన్నుపోటు పొడిచారు కదా అని జనాలు ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుపై తిరగబడలేదు. పైగా 16 సీట్లు కట్టబెట్టారు. అంటే అప్పట్లోనే చంద్రబాబుపై జనాల్లో కనిపించని వ్యతిరేకత ఇపుడు ఎందుకుంటుంది ?  అసలు ఇప్పటి తరానికి ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ ఎంతమందికి తెలుసు ? అందరికీ తెలిసేట్లుగా, బయోపిక్ పై క్రేజ్ పెరిగేట్లుగా చంద్రబాబే చేసుకుంటున్నారేమో ? ఈ విషయమై చంద్రబాబు కూడా ఓసారి ఆలోచిస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: