తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సెంటిమెంట్‌పై బీజేపీ నేత కిష‌న్‌రెడ్డి దెబ్బకొట్టారు. సికింద్రాబాద్‍ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయన ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ, టీఆర్ఎస్‌లో తెలంగాణ వాదులు ఎక్క‌డున్నార‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్యమకారుల్ని గెలిపిస్తే ఢిల్లీలో మన వాయిస్‌‌ వినిపిస్తామ‌ని అంటున్నార‌ని అనే ప్ర‌శ్న‌కు కిష‌న్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. టీఆర్‌‌ఎస్‌‌లో తెలంగాణవాదులు ఎవరు ఉన్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ``టీఆర్ఎస్‌లో తెలంగాణ వాదులు ఎక్కడోపోయారు. ఈ రోజు తెలంగాణలో ఎంపీస్‌‌ 100 క్రోర్స్ క్లబ్‌‌ ఏర్పాటు చేశారు. తలసాని, మల్లా-రెడ్డి సహా మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ అభ్యర్థులెవరూ  తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని మంత్రులే ఎక్కువ‌. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఢిల్లీకి వెళ్లి లాఠీ ఛార్జిలో దెబ్బలు తిన్నాను. తెలంగాణకు అనుకూలంగా పార్లమెంటులో 160 మంది ఎంపీల మద్దతు కూడగట్టాను.`` అని వెల్ల‌డించారు.


బీజేపీకి ఓటేస్తే మోదీకేసినట్టు, కాంగ్రెస్‌‌కు ఓటేస్తే రాహుల్‌ కు వేసినట్టు, కారుకు వేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ఓటేసినట్టు అని అంటున్న ప్ర‌చారంలో నిజమే లేద‌ని కిషన్‌‌రెడ్డి అన్నారు. ``టీఆర్‌‌ఎస్‌‌కు ఓటేస్తే కల్వకుంట్ల కుటుంబానికి గులాంగిరి చేయడానికి ఓటేసినట్టవుతుంది. నరేంద్రమోదీకి ఓటేస్తే దేశానికి ఓటేసిన‌ట్ల‌ని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నమోదీని ఆశీర్వదించాలని కోరుతున్నానన‌ని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనంగా నిధులు రాలేదని టీఆర్‌‌ఎస్‌‌ ఆరోపిచ‌డంలో నిజం లేద‌న్నారు. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్న తాను సికింద్రాబాద్‌‌ నుంచి బరిలో నిల్చానని, గెలిపిస్తే అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. బండారు దత్తా త్రేయ తనకు గురువని, ఎంపీ సీటు కోసం ఎటువంటి లాబీయింగ్‍ చేయలేదని, ఎన్నికల్లో ఆయన సపోర్టు ఎంతో ఉంటుందని చెప్పారు. 


ప్ర‌స్తుతం దేశంలో ఉన్న‌వి ప్రాంతీయ పార్టీలు కాదు కుటుంబ పార్టీలని కిష‌న్‌రెడ్డి విశ్లేషించారు. జమ్మూకశ్మీర్‌‌ నుంచి మొదలు పెడితే ఉత్తర్‌‌ప్రదేశ్ వ‌ర‌కు ఇదే దోర‌ణి అని చెప్పారు. యూపీలో ములాయం సింగ్‌ యాదవ్‌ , బిహార్‌‌లో లాలూ ప్రసాద్‌‌ యాదవ్‌ ,తమిళనాడులో డీఎంకే, కర్నాటకలో దేవగౌడ కుటుంబం, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్‌‌ కుటుంబం, ఆంధ్రాలో చంద్రబాబు ఇవన్నీకుటుంబ పార్టీలేన‌ని ఆయ‌న అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: