మంత్రి గంటా శ్రీనివాసరావుకి ఉత్తరం దొరికింది కానీ చిరునామా ఎక్కడో తెలియడం లేదు. ఇదీ ప్రస్తుతం అక్కడ నడుస్తున్న రాజకీయం. ఇప్పటికి నాలుగు విడతలుగా అసెంబ్లీ సీట్లు, పార్టీలు మార్చేసిన గంటాకు అసలైన టఫ్ ఫైట్ విశాఖ ఉత్తరంలో ఉండబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన విష్ణు కుమార్ రాజు గంటానే టార్గెట్ చేస్తూ దూకుడు రాజకీయం చెసతున్నారు. నా కంఠంలో ప్రాణం పోయినా గంటాను ఉత్తరంలో అడుగుపెట్టనీయనని రాజు గారు చేస్తున్న గర్జన గంటా వారికి నిద్ర పట్టనీయడంలేదు. గంటా ఎమ్మెల్యే అయితే కొండలు, గుట్టలు అన్నీ మిగలవు అంటూ రాజు చేస్తున్న హెచ్చరికలు కూడా గట్టిగానే జనంలోకి వెళ్తున్నాయి.


ఉత్తరం సీటు పరిధిలో మురికివాడలు ఉన్నాయి. అదే విధంగా మధ్యతరగతి వర్గం, చదువుకున్న వారు, విద్యావంతులు కూడా ఎక్కువమంది ఉన్నారు. ఇక ప్రజా సంఘాలు మేధావులు సైతం ఉత్తరంలో మంత్రిని గెలిపించవద్దంటూ సొంత ప్రచారం చేస్తున్నారు. ఆయనకు పొరపాటున ఓటేస్తే చిక్కడు, దొరకడు సుమా అంటూ హెచ్చరిస్తున్నారు. విశాఖ ఉత్తరంలో ప్రచారం తీరు వేరేగా సాగుతోంది. అభ్యర్ధులంతా వేరు వేరు పార్టీలకు చెందిన వారైనా గంటా విషయం వచ్చేసరికి మాత్రం ఒక్కటైపోతున్నారు. మాలో ఎవరు గెలిచినా ఓకే, గంటా మాత్రం వద్దు అన్నట్లుగా ప్రత్యర్ధులు చూపిస్తున్న ఐక్యత మంత్రి వర్గానికి గుండెళ్ళో గంటలు మోగించేస్తోంది.


ఇక గంటా ట్రాక్ రికార్డ్ చూసినపుడు ఆయన ఒక్కోసారి ఒక్కోచోట పోటీ చేశారు. అక్కడ ఎన్నికల్లో నిలబడినపుడు ఎన్నో అందమైన మాటలు చెప్పారు. నంబర్ వన్ గా ఆ నియోజకవర్గాన్ని చేస్తానని  చెప్పారు. తీరా అయిదేళ్ళ కాలం ముగిసాక ఆ సీటుని వదిలిపెట్టేసి వేరే రూట్ పట్టారు. సరిగ్గా ఈ విషయమే ఇపుడు ఉత్తరం ఎన్నికల్లో ప్రత్యర్ధులు ప్రొజెక్ట్ చేయడంతో గంటాకు మింగుడుపడడంలేదు అంటున్నారు. ఇక ఇక్కడ మరో విషయమేంటంటే టీడీపీ ఇక్కడ గెలిచి రెండు దశాబ్దాలు గడిచిపోయింది. దాంతో క్యాడర్ చెల్లాచెదురైంది.


ఉన్న వారు కూడా గంటా హఠాత్తుగా తమ నెత్తి మీద పడి పోటీకి దిగడంతో సహకారం అందించేందుకు ముందుకు రావడంలేదు. ఈ పరిణామాలు ఇలా ఉండగా గంటా ఇటు మీడియాకు, అటు ఓపెన్ ఫారం చర్చలకు  కూడా రాకుండా ముఖం చాటేస్తున్నారు. తనను ఎక్కడ ప్రత్యర్ధులు గట్టిగా నిలదీస్తారో అని ఆయన ముఖాముఖీ చర్చలకు రావడంలేదన్న టాక్ వినిపిస్తోంది. ఓ వైపు టీడీపీకి ప్రజా వ్యతిరేకత ఎటూ ఉంది. మరో వైపు అభ్యర్ధిగా గంటాకు కూడా వ్యతిరేకత తోడు అయితే ఉత్తరం సీట్లో జేగంట మోగుతుందా అన్న సందేహాలు పుట్టుకొస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: