మైండ్ గేమ్ ఆడటంలో చంద్రబాబానాయుడుపై తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ విజయం సాధించినట్లే ఉన్నారు.  అందుకనే పొద్దున లేచిన దగ్గర నుండి చంద్రబాబు పదే పదే కెసియార్ గురించే మాట్లాడుతున్నారు. పైగా ఏ ఉపయోగం లేని నరేంద్రమోడి గురించి మాట్లాడటానికి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఏపిలో ఏమాత్రం ప్రభావం లేని బిజేపి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచింది.

 

 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు రోజుకు నాలుగైదు సభల్లో మాట్లాడుతున్నారు. ఆ సభల్లో తన గురించి, పార్టీ గురించి చెప్పుకోవటం కన్నా జగన్, కెసియార్, మోడికి సంబంధించిన విషయాలపైనే చంద్రబాబు అధిక సమయం కేటాయిస్తున్నారు. నిజానికి జగన్ గురించి తప్ప కెసియార్, మోడి గురించి ఎంత మాట్లాడినా ఉపయోగం లేదన్నది వాస్తవం.

 

ఇక్కడే కెసియార్ మైండ్ గేమ్ కు చంద్రబాబు లొంగిపోయినట్లు అనిపిస్తోంది.  ఎన్నికల ప్రచారంలో తన పార్టీ, తన ప్రభుత్వం చేసిన, చోయబోయే కార్యక్రమాల గురించే ఎక్కువ చెప్పుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ చంద్రబాబు మాత్రం రివర్సులో మాట్లాడుతున్నారు. ఎందుకంటే తన పాలన గురించి చెప్పుకోవటానికి ఏమీలేదు.

 

చంద్రబాబు ఐదేళ్ళ పాలన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి చంద్రబాబు టార్గెట్ అంతా జగన్ పైనే ఉండాలి. ఇక్కడే కెసియార్ సక్సెస్ అయ్యారు. ప్రతీ సభలోను చంద్రబాబు గంటసేపు కేటాయిస్తున్నారని అనుకుంటే అందులో జగన్ కన్నా  కెసియార్, మోడిని తిట్టటానికే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. దాంతో ప్రతీ సభలోను చంద్రబాబు చెప్పిందే చెప్పాల్సొస్తోంది.

 

అదే సమయంలో  జగన్, షర్మిల, విజయమ్మ మాత్రం తమ పూర్తి దృష్టిని చంద్రబాబు మీదే కేంద్రీకరిస్తున్నారు. చంద్రబాబు పాలనలోని అవినీతిని ఎండగడుతూనే వైసిపి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల గురించి వివరిస్తున్నారు. అంటే జగన్ స్పీచ్ లో క్లారిటీ ఉంటోంది. అదే చంద్రబాబు స్పీచ్  మాత్రం తేలిపోతోంది. ఏపితో ఏమాత్రం సంబంధం లేని కెసియార్, మోడిని ఎంత తిడితే మాత్రం ఉపయోగమేంటి ?


మరింత సమాచారం తెలుసుకోండి: