రాష్ట్రంలో ఇపుడిదే విషయమై తీవ్రంగా చర్చ జరుగుతోంది. మిగితా రాష్ట్రం సంగతిని పక్కనపెట్టినా ఉభయ గోదావరి జిల్లాల్లోను అందులోనూ జనసేనలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నమ్ముకున్నదే కాపు సామాజికవర్గాన్ని. అందులోను ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలోని కాపులను నమ్ముకున్నారు. తీరా చూస్తే అక్కడే పవన్ పై నమ్మకం లేదనే చర్చ జోరుగా జరుగుతోందట.

 

ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ ఇదే పాయింట్ మీద చర్చ ఎందుకు పెరిగిపోతోంది ?  అందుకు జనసేనలోని వర్గాలు రెండు పాయింట్లు చెబుతున్నారు. మొదటిది వైసిపి, టిడిపిలో కాపులకు పెద్దగా టికెట్లివ్వలేదు.  పవన్ ఎలాగూ కాపులకే పెద్దపీట వేస్తారు కాబట్టి మళ్ళీ మనం కూడా కాపులకే టికెట్లివ్వాలని ఆలోచించాయట. అందుకనే కాపులకు బదులు బిసిలకు పెద్దపీట వేశాయి.

 

టిడిపి, వైసిపిలు తీసుకున్న నిర్ణయంతో టికెట్ల కేటాయింపు విషయంలో కాపులపై బాగానే దెబ్బ పడింది. ఈ పార్టీలు అన్నట్లే జనసేనలో కాపులకు ఎక్కువ టికెట్లిచ్చినా ఎంతమంది గెలుస్తారన్నది వేరే సంగతి. అదే పై పార్టీల్లో అయితే చాలామంది కాపులు గెలిచేవారేమో ?  కాబట్టి పవన్ వల్లే కాపులకు పెద్ద దెబ్బే పడింది.

 

ఇక రెండో కారణమేమిటంటే చంద్రబాబుతో పొత్తు లేదని చెబుతూనే లోపాయికారీగా సబంధాలు పెట్టుకోవటం. చంద్రబాబు, పవన్ పైకి ఎంత చెప్పినా వాళ్ళ అక్రమసంబంధం బయటపడిపోతూనే ఉంది. టికెట్ల కేటాయింపులో చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీలు  ఇచ్చిపుచ్చుకున సంగతి బయటపడిపోయింది. దాంతో పవన్ పైకి చెప్పేదొకటి లోపల చేసేదొకటి అనే విషయం అందరికీ అర్ధమైపోయింది.

 

నిజానికి లోపాయికారీ పొత్తులు అవసరం లేదు. పొత్తులు పెట్టుకోదలచుకున్నపుడు రాజమార్గంలోనే టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకునుంటే సరిపోయేది. అపుడు టిడిపిని, జనసేనను అభిమానించే సామాజికవర్గాలు, అభిమానుల ఓట్లైనా రెండుపార్టీల మధ్యా  బదలాయింపు జరిగేదేమో ? లేదూ పూర్తిగా చంద్రబాబును వ్యతిరేకించినా బాగానే ఉండేది. అపుడు చంద్రబాబు, జగన్ ను వ్యతిరేకించే వారి ఓట్లన్నా జనసేనకు పడేవేమో ? పై రెండు పద్దతుల్లోను లేకపోవటంతో పవన్ ను ఎవరు నమ్మటం లేదనే చర్చ జోరుగా జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: