కడప జిల్లాలోని మైదుకూరులో తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటి దాడులు జరిగాయి.  ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సుధాకర్ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన సమయంలో ఐటి అధికారల బృందం హఠాత్తుగా ఆయన ఇంటిపై దాడి  చేశారు. ఎన్నికల సమయం కదా ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు అధికారులు కనుక్కున్నారని సమాచారం. డబ్బుతో పాటు కీలక డాక్యుమెంట్లు కూడా అధికారులు గుర్తించారట.

 

సుధాకర్ యాదవ్ టిడిపి నేతే కాకుండా తిరుమల తిరుపతి ట్రస్టు బోర్డు ఛైర్మన్ కూడా. అదే సమయంలో సుధాకర్ మంత్రి యనమల రామకృష్ణుడుకి స్వయానా వియ్యంకుడు కూడా.  దాంతో పుట్టా పేరుతో తెలంగాణాలోను, ఏపిలో కూడా భారీ ఎత్తున ఇరిగేషన్ కాంట్రాక్టులు తీసుకున్నారు. తెలంగాణాలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, సుధాకర్ వియ్యంకులు. కాబట్టి సుధాకర్ తెలంగాణాలో కూడా చాలా కాంట్రాక్టులనే తీసుకున్నారు.

 

కడప జిల్లాలో ఉన్న కొద్దిమంది టిడిపి నేతల్లో సుధాకర్ బాగా స్ధితిమంతుడి కిందే లెక్క. అన్నీ విధాలుగా పుట్టా బలవంతుడు కాబట్టే చంద్రబాబునాయుడు కూడా పుట్టాకే టికెట్ ఇచ్చారు. మరోవైపు వారం రోజుల్లో పోలింగ్ జరుగనున్న నేపధ్యంలో ఈరోజు ఐటి దాడులు జరగటం పార్టీలో సంచలనంగా మారింది. ఇప్పటికే సుజనా చౌదరి, సిఎం రమేష్, బీద మస్తాన్ రావు, పోతుల రామారావు తదితరుల వ్యాపారాలు, ఇళ్ళపై ఐటి, ఈడి దాడులు జరుగటంతో చంద్రబాబు అండ్ కో లో టెన్షన్ పెరిగిపోతోంది. మరికొందరు నేతలపైన కూడా దాడులు జరిగే అవకాశాలున్నాయని పార్టీ అనుమానిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: