సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో సంచ‌ల‌న ప‌రిణామం చోటు చేసుకుంది. 54 వేల మంది ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు రోడ్డున ప‌డ‌నున్నారు. బీఎస్ఎన్ఎల్‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు ఈ షాక్ త‌గ‌ల‌నుంది. వారిని ఇంటికి పంపించే ప్రతిపాదనకు బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. అంతేకాదు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా రిటైర్మెంట్ వయసును 58 సంవత్సరాలకు తగ్గించింది.


ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తీవ్ర నష్టాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. తొలిసారి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిపోయింది. దీంతో ఉద్యోగులకు జీతాల కోసం ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల అప్పు కూడా చేయాల్సి వచ్చింది. దీనికితోడు ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి రావాల్సిన రూ.2900 కోట్లు చెల్లించడంతోపాటు మరో రూ.3500 కోట్ల రుణం కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం ఇచ్చింది. ఈ డబ్బుతో మరో మూడు, నాలుగు నెలల వరకు బీఎస్‌ఎన్‌ఎల్ తన కార్యకలాపాలను కొనసాగించే వీలు కలిగింది. మరో రూ.700 కోట్లు కూడా రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి రావాల్సి ఉంది.


ప్రస్తుతం ఈ టెలికాం సంస్థలో మొత్తం 1.76 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే సంస్థ‌ను గాడిలో పెట్టేందుకు త‌గు నిర్ణ‌యం కోసం ఇటీవ‌ల అధికారులు స‌మావేశ‌మ‌య్యారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు మొత్తం పది ప్రతిపాదనలను సూచించగా.. అందులో మూడింటికి బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. కాగా, ప్ర‌ధాని మోదీ ఆదుకోక‌పోవ‌డం వ‌ల్లే...54 వేల‌మంది రోడ్డున ప‌డుతున్నార‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. 


ఎన్నికల సమయంలో ఉద్యోగుల తొలగింపు, వీఆర్ఎస్ ప్యాకేజీ, వ్యాపారం మూసేయడం వంటి ప్రకటనల ప్రభావం సిబ్బందిపైనే కాకుండా ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఈ నిర్ణయం వాయిదా వేసినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వార్తాపత్రిక తన కథనంలో పేర్కొంది. అందువల్ల ఎన్నికలు ముగిసే వరకు ఉద్యోగుల తొలగింపు ప్రణాళికపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని టెలికమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ (డీఓటీ) భావిస్తోంది. 


బీఎస్ఎన్ఎల్ బోర్డు ఆమోదించిన ప్రతిపాదనలలో రిటైర్మెంట్ వయసును 60 నుంచి 58 ఏళ్లకి తగ్గించడం, 50 ఏళ్లకి పైబడిన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రకటించడం, త్వరగా 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరపడం ఉన్నాయి. రిటైర్మెంట్ వయసు, వీఆర్ఎస్ నిర్ణయాలకు ప్రభుత్వ అనుమతి లభిస్తే బీఎస్ఎన్ఎల్ లో 54,451 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు వీడక తప్పదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: