గాజువాక ఇపుడు హాట్ టాపిక్ అయింది. అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూండడంతో అందరి ద్రుష్టిని ఆకట్టుకుంటోంది. గాజువాకలో పవన్ ఎంట్రీకు ముందు వైసీపీ, టీడీపీ మధ్యనే పోరు అన్నట్టుగా ఉండేది. పవన్ పోటీ అన్నాక ప్రధాన పార్టీలు ఒక్కసారిగా  అలెర్ట్ అయ్యాయి. టీడీపీ, వైసీపీ సంస్థాగతంగా బలంగా ఉండడంతో పాటు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపధ్యంలో వైసీపీలో అసమ్మతి నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డిని టీడీపీలోకి చేర్చుకున్నారు.

అయితే ఆయన పట్ల స్థానికంగా వ్యతిరేకత బాగా ఉండడంతోనే వైసీపీ పక్కన పెట్టేసింది.  గాజువాక మున్సిపల్ చైర్మన్ గా, పెందుర్తి ఎమ్మెల్యేగా తిప్పల ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో 2009 ఎన్నికల్లో వైఎస్ హవాలో సైతం ఆయన మూడవ స్థానతో ఓడిపోవాల్సివచ్చింది ఇక ఆయన అటు చేరగానే వైసీపీకి బంపర్ ఆఫర్ తగిలినట్లుగా గాజువాక ఇంటాక్ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ ఆ పార్టీలోకి వచ్చేశారు. స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకుడిగా ఉంటూ వచ్చిన మంత్రి వెనక వేలాది మంది కార్మికులు ఉండడంతో  ఇపుడు వైసీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. 


బలమైన నాయకుడు, కార్మిక వర్గాన్ని కదిలించే మంత్రి చేరికతో వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి విజయావకాశాలు ఒక్కసారిగా పెరిగాయని చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ కార్మికులు ఎక్కువగా ఉంటారు. వైసీపీకి ఉన్న బలానికి తోడుగా మంత్రి రాజశేఖర్ కలసివస్తారని అంచనా కడుతున్నారు. పైగా బీసీ వర్గం నేత కావడం కూడా మరో ప్లస్ పాయింటుగా ఉంది.  నిజానికి మంత్రి రాజశేఖర్ ని టీడీపీ  చేర్చుకోవాలనుకుంది. అయితే తిప్పల  తురుమూర్తి రెడ్డితో ఉన్న విభేదాలు, వైసీపీకి ఉన్న ఆదరణ చూసే ఆయన ఇటువైపుగా వచ్చారని తెలుస్తోంది.


 ఇక మరో వైపు టీడీపీ కూడా ఎలాగైనా సీటుని నిలబెట్టుకోవాలనుకుంటోంది. పల్లా శ్రీనివాస్ సైతం బలమైన యాదవ సామాజికవర్గం నేత కావడంతో పాటు, అన్ని వర్గాలతో సంబంధాలు ఉండడం, అంతటా ఆయనకు బంధుగణం ఉండడం కలసివస్తుందని చెబుతున్నారు. ఇక ఈ మొత్తం పరిస్థితిని చూసినపుడు పవన్ కళ్యాణ్ పోటీని చూసి ప్రధాన పార్టీలు బాగానే సర్దేసుకున్నాయని చెప్పకపతప్పదు. టీడీపీ, వైసీపీల మధ్యన ఢీ అంటే ఢీ అనేలా ఇక్కడ పోటీ సాగనుంది. 


మరి జనసేన విషయానికి వస్తే  ఆయనకు ఉన్న గ్లామర్ ఆధారంగానే గెలవాలని చూస్తోంది తప్ప  పార్టీ పరంగా అక్కడ సంస్థాగత నిర్మాణం పెద్దగా లేకపోవడం లోటుగానే ఉంది. అయినప్పటికీ పవన్ చరిష్మాతో నెగ్గుతారని జనసేన నేతలు చెబుతున్నారు. మరి ఇపుడున్న‌ పరిస్థితుల్లో అటు టీదీపీ, ఇటు వైసీపీ కూడా బలం పుంజుకుని బస్తీమే సవాల్ అంటున్నాయి. జనసేనాని వీరిని తట్టుకుని ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: