సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు సుప‌రిచితుడు అయిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అదే త‌ర‌హాలో మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కీల‌క‌మైన ఎన్నిక‌లు జ‌రుగుత‌న్న త‌రుణంలో ఆయ‌న క‌ల‌క‌లం రేపే కామెంట్ చేశారు. రెవెన్యూ చ‌ట్టంపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన కేసీఆర్ తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. రెవెన్యూ యాక్ట్‌ను మార్చాలని కేసీఆర్ అన్నారు. ``రెవెన్యూ పేరే బేకారుగా ఉన్నది. జిల్లా కలెక్టర్ పేరు కూడా మార్చాలి. కలెక్టర్ కలెక్ట్ చేసేది ఏం లేదు. ఇప్పుడు రైతులకే ఇస్తున్నాం. రైతుల నుంచి తీసుకునేది ఏమీ లేదు. రైతాంగం అధికారులు చెప్పినట్టు ఫాలో అవ్వాలి. రైతు సమన్వయ సమితులు చెప్పినట్టు వినాలి. వీఆర్ఓ పేరును సైతం మార్చేస్తాం`` అంటూ సంచల‌న ప్ర‌క‌ట‌న చేశారు.


మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన‌ టీఆర్‌ఎస్ బహిరంగ సభలో  సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నాయకులకంటే ప్రజలకే ఎక్కువగా అవగాహన ఉంటుందన్నారు.``మీరిచ్చే తీర్పులు, నిర్ణయాలు అంత బాగుంటాయి. ప్రతి విషయాన్ని మీరు గమనిస్తున్నారని చెప్పారు. మహబూబాబాద్‌ను ఎందుకు జిల్లా చేయాల్సి వచ్చిందని చాలా మంది తనను అడుగుతున్నారని.. ఒక్క మహబూబాబాదే కాదు.. పూర్వ వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, జనగామను కూడా జిల్లాగా చేసుకున్నాం. ఈ ప్రాంతాలన్నీ గిరిజనులు కేంద్రీకృతమైన ప్రాంతాలని.. వాళ్లు బాగుపడాలంటే ఏదో డంభాచారాలు కొడితే పని కాదని.. గిరిజనుల బతుకుల్లో వెలుతురు రావాలంటే పరిపాలన వాళ్ల దగ్గరికే రావాలన్నారు. అందుకే నాలుగు జిల్లాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.`` అని సీఎం కేసీఆర్ తెలిపారు. 


ఉద్యమ సందర్భంలో ఢిల్లీలో అడిగిన ప్ర‌శ్న‌కు ఇప్పుడు స‌మాధానం దొరికింద‌న్నారు. `` ఆ సంద‌ర్భంలో కేసీఆర్ తెలంగాణ వస్తే ఏం చేస్తావు అని వివిధ రాష్ట్రాల‌ వాళ్లు అడిగే వాళ్లు. వాళ్లందరు కూడా ఇప్పుడు వివిధ సందర్భాల్లో నన్ను కలిసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. మీరు ఇవన్నీ ఎలా చేస్తున్నారని అడుగుతున్నారు. వివిధ రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ సంక్షేమం కోసం ఏంచేస్తున్నామనేది దేశమంతా తెలుసు. అది చేయి ఇది చేయి అని నన్ను ఎవరూ అడగలేదు. మేం చర్చ చేసి తెలంగాణకు ఏం చేయాలో అది చేస్తున్నాం. ఎక్కడ ఎవరికి ఏది అవసరమో అది చేసుకుంటూ వెళ్తున్నాం. రైతుల రుణమాఫి కూడా మూడునాలుగు కిస్తీల్లో అమలు చేస్తాం. లక్ష రూపాయలు మాఫీ తప్పకుండా చేస్తాం. దానిపై ఏ రైతూ రందీ పడాల్సిన అవసరం లేదు`` అని కేసీఆర్ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: