ఓట్ల కోసం తమవాళ్ళు 10 రూపాయలు ఖర్చు చేద్దామని చూస్తుంటే ఐటి సోదాల పేరుతో సాధ్యం కావటం లేదని చంద్రబాబునాయుడు సంచలన ప్రకటన చేశారు. అందుకే శుభ్రంగా వివిధ పథకాల పేరుతో ఓట్ల కోసం ప్రభుత్వ డబ్బులనే ఖర్చు చేస్తున్నట్లు బహిరంగంగా ఒప్పేసుకున్నారు. పసుపు కుంకుమ, ఫించన్లకు 2 వేల రూపాయలు, అన్నదాతా సుఖీభవ అనే పథకాల ద్వారా జనాలకు డబ్బులు పంచుతున్నట్లు చంద్రబాబు బహిరంగంగా చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు చెప్పినట్లు మాట్లాడలేదు. అధికారంలో ఉన్న పార్టీ అమలు చేసే కార్యక్రమాలు తదుపరి ఓట్ల కోసమే అనేది అందరికీ తెలిసిందే. ఎన్నికలొచ్చినపుడు జనాలు ఓట్లేస్తే వేస్తారు లేకపోతే లేదు. అంతేకానీ చంద్రబాబు చెప్పినట్లుగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నందుకు, ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకు తనకు గాక ఇంకెవరికి ఓట్లేస్తారని జనాలను నిలదీయం కూడా విచిత్రంగానే ఉంది.

 

ప్రభుత్వ డబ్బునే ప్రజలకు ఓట్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు ఒప్పుకున్న సిఎం కూడా జనాలకు తన జేబులో నుండి డబ్బులు ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.  ఎన్నికల సమయంలో తమ నేతలపై ఐటి, ఈడి దాడులు చేస్తున్న కారణంగానే తమ నేతలు ఓటర్లకు డబ్బులు పంచలేకపోతున్నట్లు నిర్లజ్జగా చంద్రబాబు ఒప్పేసుకున్నారు.  అంటే ఐదేళ్ళల్లో టిడిపి నేతలు ఏ స్ధాయిలో కోట్లాది రూపాయలు అడ్డంగా దోచేసుకున్నారో జనాలకు ఇపుడు అర్ధమవుతోంది.

 

ప్రజల సొమ్మును అడ్డంగా దోచేసుకున్న నేతలపై ఐటి, ఈడి దాడులు దాడులు చేయకూడదని చంద్రబాబు చెబుతుండటమే విచిత్రంగా ఉంది. బ్యాంకుల్లో వందల కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టినవారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనా వ్యయాలను వందల కోట్లు పెంచేసి దోచేసుకుంటున్నవారు టిడిపిలో కీలక వ్యక్తులుగా చెలామణవుతున్నారు. తమ నేతలపై వరుసగా దాడులు చేస్తున్నారని అంటూనే రెండు రోజుల్లో తనను కూడా అరెస్టు చేస్తారేమో అని అంటున్నారంటే విడ్డూరంగా ఉంది. అంటే అరెస్టవటం ద్వారా చంద్రబాబు జనాల సింపతిని అందుకోవాలని చూస్తున్నట్లుంది.

 

గడచిన ఐదేళ్ళ పాలనలో తాను ఇది చేశానని, మళ్ళీ వస్తే ఐదేళ్ళ పాలననే తిరిగి అందిస్తానని చెప్పే ధైర్యం చేయటం లేదు చంద్రబాబు. ఎంతసేపు జగన్, కెసియార్, మోడి జట్టు తనను ఇబ్బంది పెడుతోందనే చెబుతున్నారు. తన ఐదేళ్ళ పాలన గురించి చెప్పుకోవటానికి ఏమీలేకే జగన్ ను టార్గెట్  గా చేసుకున్నారు. తనను గెలిపిస్తే విద్యార్ధులకు ల్యాప్ టాప్లు, కంప్యూటర్లు ఇస్తానని తాజాగా హామీ ఇచ్చారు. అంటే ఇది కూడా జనాల డబ్బే అని అర్ధమవుతోంది. అంటే మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారిని కూడా చంద్రబాబు ప్రలోభాలకు గురిచేయటం మొదలుపెట్టారని అర్ధమైపోతోంది. మరి జనాల డబ్బు జనాలకే పంచుతున్న చంద్రబాబుకు ఓట్లేస్తారా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: