విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇపుడు ఏకంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇక్కడ నుంచి సుజయక్రిష్ణ రంగారావు వరసగా మూడు సార్లు గెలిచి మరో మారు పోటీకి రెడీ అవుతున్నారు. ఫిరాయింపు మంత్రిగా ఉన్న ఆయన్ని ఓడించాలని వైసీపీ ఇక్కడ సర్వ శక్తులూ ఒడ్డుతోంది. మరో వైపు మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బొబ్బిలి రాజు, ఆపద్ధర్మ మంత్రి అయిన రంగారావు పావులు కదుపుతున్నారు. బొబ్బిలి రాజులకు ఎంతో  ఘనమైన చరిత్ర ఉంది. స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ జమానాలో ప్రస్తుతం మంత్రి తాత గారు రంగారావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970 వరకూ బొబ్బిలి రాజులు ఎమ్మెల్యేలుగా పనిచేసినా తరువాత కాలంలో వారు రాజకీయాలను వదిలేశారు. తిరిగి 2004 నాటికి రంగారావు రాజకీయాల్లొకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి రెండు మార్లు గెలిచిన అయన వైఎస్సార్ చనిపోయాక జగన్ వైపు వచ్చారు.

 


ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఆయన మంత్రి పదవి కోసం టీడీపీలోకి ఫిరాయించారు. ఇపుడు ఆయన మళ్ళీ పోటీ చేస్తుంటే వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలయానుడుని పోటీకి పెట్టారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన శంబంగి ఇపుడు మళ్ళీ గెలిచేందుకు రెడీ అవుతున్నారు. అయితే బొబ్బిలి రాజులు వ్యూహాలను బాగా అమలుచేస్తున్నారు. ఇంతకాలం పట్టించుకోని వర్గాలను దగ్గరకు తీస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడుని కలుపుకుని ఆయనకు బొబ్బిలి అభివ్రుధ్ధి సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారు. అలాగే వైసీపీలో ఉన్న సీనియర్ నేత  వాసిరెడ్డి వరద రామారావుని పార్టీలోకి తీసుకున్నారు. అన్ని విధాలుగా బలంగా పరిస్థితులను మార్చుకుని సై అంటున్నారు.

 

 

నిజానికి అక్కడ పేరుకు శంబంగి చిన అప్పలనాయుడుని నిలబెట్టినా వెనక ఉన్నది బొత్స  సత్యనారాయణ. ఆయన ఎలాగైనా ఫిరాయింపు మంత్రిని ఓడించాలని చూస్తున్నారు. దాని కోసం అన్ని రకాలుగా రంగం సిద్ధం చేస్తున్నారు. స్వయంగా తన మేనల్లుడు చిన్న శ్రీనుని ఎన్నికల పరిశీలకునిగా నియమించారు. నిజానికి ఇక్కడ బొబ్బిలి రాజులు వెలమ దొరలుగా చలామణీ అవుతున్నారు. వారు అగ్ర కులస్థులుగా వస్తారు. అక్కడ ఉన్నది బీసీ వెలమలు. వారితో రాజులకు విభేదాలు ఉన్నాయి. కోటలో రాజకీయాన్ని వ్యతిరేకించే సామాన్యులకు ప్రతినిధిగా బీసీ వెలమ శంబంగి అప్పలనాయుడు పోటీలో ఉండడంతో ఆ విధంగా పరిస్థితిని అనుకూలం చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి చూసుకుంటే ఈసారి బొబ్బిలి రాజులు గెలుపు కోసం చమటోడుస్తూన్నారనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: