కృష్ణాజిల్లాలోని రెండు పార్లమెంటు స్ధానాల్లో మచిలీపట్నం పోర్టు సిటీగా బాగా పాపులరైంది. ఇక్కడ నుండి హ్యాట్రిక్ కొట్టాలని టిడిపి  సిట్టింగ్ ఎంపి కొనకళ్ళ నారాయణ పోటీ చేస్తుండగా మూడో ఓటమి నుండి తప్పించుకోవాలని వైసిపి ఎంపి అభ్యర్ధి బాలశౌరి పోటీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ పోటీ బాగా రసవత్తరంగా సాగుతోంది. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల గెలుపోటముల పైనే ఎంపి అభ్యర్ధుల భవిష్యత్తు ఆధార పడుంటుందని అందరికీ తెలిసిందే.

 

లోక్ సభ పరిధిలో మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, గన్నవరం, పెనమలూరు అసెంబ్లీ స్ధానాలున్నాయి. ఈ స్ధానాల్లో రెండు పార్టీల నుండి దాదాపు గట్టి అభ్యర్ధులే పోటీలో ఉన్నారు. అందుకనే అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్ధానంలో కూడా పోటీ చాలా హోరా హోరీగా సాగుతోంది. టిడిపి అభ్యర్ధి కొనకళ్ళ నారాయణపై ఆరోపణలేవీ లేవనే చెప్పాలి. పైగా వివాదరహితుడు కూడా. కాకపోతే జరగాల్సినంత అభివృద్ధి జరగలేదనే చెప్పాలి.

 

నాలుగేళ్ళపాటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా మచిలీపట్నం అభివృద్ధికి తీసుకున్న చర్యలు పెద్దగా లేవు. అలాగే, ఈ సిటీ సముద్రతీరంలో ఉండటంతో తరచూ ఇబ్బందులకు గురవుతోంది. 2009, 2914లో వరుసగా రెండుసార్లు గెలిచిన కొనకళ్ళ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. అలాగే నరసరావుపేట ఎంపిగా పోటీ చేసి రెండుసార్లు బాలశౌరి ఓడిపోయారు. అందుకనే మూడోసారి బందరులో గెలవాలని పట్టుదలగా ఉన్నారు. టిడిపి అభ్యర్ధికి  ప్రభుత్వ పరంగా జరిగిన అవినీతి, పార్టీలో అంతర్గతంగా వివాదాలు, అసెంబ్లీ అభ్యర్ధులపై పెరిగిపోయిన అవినీతి ఆరోపణలు, కాల్ మనీ సెక్స్ రాకెట్ వివాదాలు బాగా మైనస్ గా మారింది.

 

ఈ నియోజకవర్గంలో సుమారు 15 లక్షల ఓట్లున్నాయి. వీరిలో అత్యధికంగా 5 లక్షల బిసి సామాజికర్గాల ఓట్లున్నాయి.  బిసిల తర్వాత 2.5 లక్షల ఎస్సీల ఓట్లు,  2.3 లక్షల కాపు ఓట్లు, 1.25 లక్షల కమ్మలు, ముస్లింలు, వైశ్యులు దాదాపు లక్ష, ఇతరులు సుమారు 2 లక్షలమందున్నారు. చంద్రబాబునాయుడు విధానాల వల్ల బిసిలు బాగా మండిపోతున్నారు. అలాగే, కాపు ఓట్లలో చీలక రావచ్చు. ముస్లింలు, వైశ్యులు, బ్రాహ్మణులు చంద్రబాబుపై మండుతున్నారు.

 

టిడిపి తరపున పోటీ చేస్తున్న అసెంబ్లీ అభ్యర్ధుల్లో అత్యధికులపై జనాలు బాగా మండుతున్నారు.  నేరుగా ఎంఎల్ఏలపైనే అవినీతి ఆరోపణలున్నాయి. పెనమలూరు ఎంఎల్ఏ బోడె ప్రసాద్ కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కుపోయారు.  వైసిపి తరపున కొలుసు పార్ధసారధి పోటీలో ఉన్నారు. గన్నవరంలో టిడిపి అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ, వైసిపి తరపున యడ్లపాటి వెంకట్రావు పోటీ చేస్తున్నారు.

 

పెడనలో కాగిత వెంకట కృష్ణప్రసాద్, వైసిపి తరపున జోగి రమేష్ పోటీ చేస్తున్నారు.  మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఉండగా వైసిపి తరపున పేర్ని వెంకట్రామయ్య పోటీ చేస్తున్నారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ పోటీలో ఉండగా వైసిపి తరపున సింహాద్రి రమేష్ బాబు రంగంలో ఉన్నారు. పామర్రులో ఫిరాయింపు ఎంఎల్ఏ ఉప్పులేటి కల్పన పోటీలో ఉండగా, వైసిపి తరపున కైలే అనీల్ కుమార్ పోటీలో ఉన్నారు. గుడివాడలో వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఏ కొడాలినాని పోటీలో ఉంటే టిడిపి తరపున దేవినేని అవినాష్ రంగంలో ఉన్నారు. మొత్తం మీద అసెంబ్లీ బరిలో అందరూ గట్టి అభ్యర్ధులే ఉన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: