‘రాబోయే ఎన్నికల్లో  ఓడిపోతే వైసిపి ఖతం’  ఇవి తాజాగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా తాజాగా  ఓ ఆడియో టేపు వైరల్ అవుతోంది.  ఆడియోటేపు నిజంగానే రాజ్యసభ సభ్యుడు మాట్లాడిందా లేకపోతే ఎవరైనా మిమిక్రీ చేసి విజయసాయి గొంతును అనుకరించారా ? అన్నది తేలాల్సుంది. అయితే చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే ఓ మీడియాలో ఆ ఆడియో టేపు వినబడుతోంది. అందులో రాబోయే ఎన్నికల గురించి విజయసాయి చేసిన హెచ్చరికలు, ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లాంటి విషయాల్లో హెచ్చరికలున్నాయి.

 

సదరు టేపులో చంద్రబాబు గురించి, రాష్ట్రంలో కులాల గురించి, ప్రజల నిబద్ధత గురించి విజయసాయి అనేక హెచ్చరికలు చేశారు. అయితే విజయసాయి ఎవరితో మాట్లాడారు అన్న వివరాలు మాత్రం లేవు.  సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి మీడియాలో మాత్రం వైసిపి బ్రహ్మాండమంటూ నేతలు చెప్పుకుంటే ఉపయోగం లేదన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు అధికారంలోకి రాబోయేది మన పార్టీనే అని పదే పదే చెబితే అధినేత ఎవరైనా నిజమే అనుకుంటారంటూ సున్నితంగా హెచ్చరించారు.

 

ఏపిలో ఉన్నని కులాల మధ్య సంఘర్షణ తెలంగాణాలో లేదన్నారు. తెలంగాణా ప్రజలకున్న నిబద్ధత కూడా ఏపి జనాలకు లేదన్నారు. తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు వచ్చేస్తున్నారనే భయంతో అందరూ ఏకమై కెసియార్ నే మళ్ళీగెలిపించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి నిబద్దత మన దగ్గర లేదన్నారు. చంద్రబాబు మహాభారతంలో దుర్యోధనుడి వంటి వాడన్నారు. చివరి నిముషం వరకూ గెలుపుకోసం పోరాటం చేస్తునే ఉంటాడని హెచ్చరించారు.

 

మనం అధికారంలోకి రావటానికి ఎవరి సహకారం ఉండదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. రేపటి ఎన్నికల్లో గెలిచేశామని, ప్రమాణస్వీకరం మాత్రమే మిగిలుందనే మూర్ఖత్వంలో ఉంటే కష్టమని గట్టిగా హెచ్చరించారు. కులాలను ఎలా మ్యానేజ్ చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసున్నారు. గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ కు బలముందని తెలుసుకుని చంద్రబాబు జనసేన అధినేతను కూడా మ్యానేజ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబంత నీచమైన నాయకుడు భారతదేశంలోనే లేడన్నారు.

 

 మోడి కూడా మనకేమీ సాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. న్యాయబద్దంగా వెళితే చాలన్నారు. మన బలం మీద మోడి ఆధారపడాలని మోడి చూస్తున్నట్లు చెప్పారు. మన నిజాయితీ మీద, మన బలం మీద మోడి ఆధారపడినట్లు చెప్పారు. మోడి మనకేమీ సాయం చేయటం లేదన్నారు. మోడి స్వార్ధపరుడని విజయసాయి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గెలిచినట్లున్న అవకాశాలున్నంత మాత్రానా గెలిచేసినట్లు కాదన్నారు. మొత్తానికి విజయసాయి ఆడియోటేపులు కలకలం సృష్టిస్తున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: