రాయలసీమలో 2014 లో టీడీపీ 22 స్థానాలను నెగ్గింది. అయితే ఇప్పుడు అన్ని స్థానాలు రావటం కష్టమని తేలిపోయింది. గత ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు అసెంబ్లీ సీట్లను అయినా గెలిచింది అంటే.. అందుకు ప్రధాన కారణం రుణమాఫీ హామీ. డ్వాక్రా రుణమాఫీ హామీ. వాటికి ఆశపడి చాలామంది తెలుగుదేశంపార్టీకి ఓటువేశారు. అంతకు ఐదేళ్ల కిందటివరకూ తొమ్మిదేళ్ల చంద్రబాబు నాయుడు పాలన చేదు ఫలితాలను చూసినా.. ఆశపడి ఓట్లు వేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఆ హామీలు విషయంలో దారుణంగా విఫలం అయ్యారు.


పోలింగ్‌కు ముందు రైతులకు, డ్వాక్రా మహిళలకు ఏదో చిల్లర వేయడమే తప్ప.. రైతులు, మహిళలు కోరుకున్న మాఫీలు మాత్రం జరగలేదు. దీంతో ఆ వ్యతిరేకత అంతా ఇప్పుడు ఓటుగా ప్రతిఫలించడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పన్నెండు సీట్లను ఇచ్చిన అనంతపురం టీడీపీకి భారీగా కోత వేయనుంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మూడు నాలుగు సీట్లు వచ్చేలా ఉన్నాయంతే. ఇక చిత్తూరులో కూడా సిట్టింగుల మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది.


యాభై రెండు అసెంబ్లీ స్థానాలకు గానూ.. గతంలో గెలిచిన ఇరవై రెండులో కూడా పది సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ కోల్పోతుందని ఒక అంచనా. గత ఎన్నికల సమయంలో పవన్‌ కల్యాణ్‌ మద్దతు, సీమలో కొద్దోగొప్పో కనిపించిన మోడీ హవా, రుణమాఫీ ప్రభావం.. పదేళ్ల కాంగ్రెస్‌ పాలన మీద వ్యతిరేకత.. ఇవన్నీ కలుపుకుంటే యాభై రెండుకు గానూ టీడీపీకి వచ్చింది ఇరవై రెండు. ఈసారి పై ఫ్యాక్టర్లు ఏవీ తెలుగుదేశం పార్టీకి తోడులేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత అదనంగా ఉండటంతో.. టీడీపీ సీమలో సింగిల్‌ డిజిట్‌ నంబర్‌ సీట్లకు పరిమితం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: