ఆయన ఓటమెరుగని వీరుడు. ఇప్పటికి నాలుగు ఎన్నికలను చూసినవారు. అనేక నియోజకవర్గాలను సైతం మార్చినా గెలుపు గుర్రాన్ని మాత్రం దిగని వారు. అటువంటి మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరం నుంచి ఈసారి పోటీలో ఉన్నారు. ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుపు ఖాయమని తమ్ముళ్ళు అంటున్నారు. అయితే మిగిలినవి వేరు, విశాఖ ఉత్తరం వేరు. ఇక్కడ గత రెండు దశాబ్దాలుగా టీడీపీ గెలిచింది లేదు. పైగా క్యాడర్ చెల్లాచుదురైన పరిస్థితి ఉంది. ఇక పట్టణ జనాభా, మధ్యతరగతి వర్గం చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. మరి ఇక్కడ నుంచి మంత్రి పోటీ చేస్తున్నారంటే విజయానికి ఆయన ఎంత శ్రమ పడాలో కూడా చూడాల్సి ఉంది.

 


 

విశాఖ ఉత్తరంలో త్రిముఖ పోరు సాగుతోంది. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉన్నారు. ఆయన మీద మచ్చ అన్నది లేదు. నీతి నిజాయతిగా ఉంటారని పేరు. ఆయనకు ఉత్తరంలో మధ్యతరగతి వర్గం గట్టిగా మద్దతు ఇస్తోంది. అదే విధంగా ఉత్తర భారతం నుంచి వచ్చి విశాఖలో వ్యా పారం, ఉపాధి కోసం స్థిరపడిన వారంతా బీజేపీకి ఓటు వేస్తారు. వీటితో పాటు అయిదేళ్ళ కాలంలో ఎమ్మెల్యేగా ఆయన చేసిన పనుల వల్ల ఏర్పడిన ఓటు బ్యాంక్ ఉంది. దాంతో ఆయన ధీమాగా ఉన్నారు.

 

 

అదే విధంగా వైసీపీ తరఫున పోటీలో ఉన్న రియల్టర్ కేకే రాజు గత ఆరు నెలలుగా చాప కింద నీరులా ఉంటూ పనిచేసుకుంటున్నారు. ఆయన పక్కా ప్లాన్ తో పార్టీ ప్రచారం చేస్తున్నారు. ఇక మొత్తం పదహారు వార్డుల్లో బల మైన వైసీపీ అధ్యక్షులు ఉన్నారు. వారంతా వైసీపీ విజయానికి క్రుషి చేస్తున్నారు. దానికి తోడు ఈసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు కూదా రాజు గెలుపునకు కలసివచ్చేలా ఉన్నాయి. వెలమలు, బీసీలు వైసీపీ వైపు గట్టిగా నిలబడ్డారు. దాంతో తన విజయం ఖాయమని రాజు భావిస్తున్నారు.

 


 

ప్రత్యర్ధుల బలం, బలహీనతలు అంచనా వేసుకుని మంత్రి గంటా వ్యూహ రచన చేస్తున్నారు. రెండు పార్టీలలో అసమ్మతి నేతలకు గేలం వేయడం ద్వారా వారిని తన పక్కకు తిప్పుకుంటున్న మంత్రి మరో వైపు కుల నాయకులను కూడా ఆకట్టుకుంటున్నారు. అయితే ఇద్దరు అభ్యర్ధులతో పోలిస్తే గంటా ఆలస్యంగా ప్రచారం ప్రారంభించడం, పైగా అవినీతి ఆరోపణలు వంటివి మైనస్ గా ఉన్నాయి. ఐతే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ప్రత్యర్ధులుగా ఉండడంతో ఓట్ల చీలికతో తాను గట్టెక్కుతానని మంత్రి అంచనా వేస్తున్నారు. మరో వైపు గంటాకు ఉత్తరంలో మూడవ స్థానమేనని సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కచ్చితంగా చెబుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: