అవును క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అదే అనుమానం పెరిగిపోతోంది. ఇపుడు మొదలైన పోలింగ్ లో ప్రధాన అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డే అనటంలో సందేహం లేదు. జగన్ ను సిఎంగా ఎన్నుకోవాలా ? వద్దా ? అన్నదే జనాలముందున్న అజెండా. ఆ పాయింట్ మీద జనాలభిప్రాయ సేకరణ కోసం నిర్వహిస్తున్న ఎన్నికలాగే ఉంది చూస్తుంటే.

 

మిగితా దేశమంతటా జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతోంది. బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీఏని గద్దె దించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపిఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మళ్ళీ అధికారంలో కొనసాగేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సరే వాళ్ళ ప్రయత్నాలు ఏమవుతాయన్నది మనకు అప్రస్తుతం అనుకోండి అది వేరే సంగతి.

 

ఎన్డీఏ, యూపిఏ మనకు ఎందుకు అప్రస్తుతమంటే ఏపిలో రెండు కూడా చూపే ప్రభావం ఏమీ ఉండదు గనుకే. రాష్ట్ర రాజకీయాల్లో మిగిలిన పార్టీలతో పాటు బిజెపి,కాంగ్రెస్ కూడా పోటి చేస్తున్నాయని చెప్పుకోవటానికి, ఈవిఎంలో బొమ్మ కనబడటానికి తప్ప మరెందుకు ఉపయోగపడవన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి నరేంద్రమోడి అయినా రాహూల్ గాంధి అయినా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇక జనసేన, వామపక్షాలు కేవలం ఉనికి కోసమే పోటీ చేస్తున్న విషయం అందరికీ అర్ధమైపోయింది.

 

ఈ నేపధ్యంలో మిగిలింది టిడిపి, వైసిపిలు మాత్రమే. చంద్రబాబునాయుడు మళ్ళీ అధికారంలోకి రావాలా అన్న విషయాన్ని ఎవరూ  ఆలోచించం లేదు. ఎందుకంటే, ఐదేళ్ళ నిర్వాకంలో చంద్రబాబు  ఏమాత్రం ఒరగబెట్టాడు అన్నది అందరూ చూసిందే. ఎక్కడ చూసినా పెరిగిపోయిన అవినీతి, కులాధిపత్యం, గాడితప్పిన పాలనే కనబడుతుంది. కాబట్టి రెండోసారి చంద్రబాబుకు అధికారం అప్పగించాలా ? వద్దా ? అన్న విషయం పెద్ద ముఖ్యం కాదు.

 

ఎందుకంటే, ఎక్కడ చూసినా జగన్ కు ఓ ఛాన్సిచ్చిచూద్దాం అన్న భావనే జనాల్లో కనబడుతోంది. మూడుసార్లు చంద్రబాబుకు అధికారం ఇచ్చాం కదా ? ఒకసారి జగన్ కు కూడా అవకాశం ఇచ్చి చూద్దాం అని జనాలు ఫిక్స్ అయినట్లు అర్ధమవుతోంది. ఒక్కసారి కూడా జగన్ కు అవకాశం ఇవ్వకుండానే పాలన ఎలాగుంటుందో చెప్పలేం. కాబట్టి పోలింగ్ లో ఫ్యాన్ గుర్తుకే ఓట్లేద్దాం అని జనాలు నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. అందుకే ఇపుడు మొదలైన పోలింగ్ జగన్ ను సిఎంగా చూడాలా ? వద్దా ? అని తేల్చేందుకే అని స్పష్టమవుతోంది. చూద్దాం జనాలు ఏం డిసైడ్ చేస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: