కీలకమైన పార్లమెంటు ఎన్నికలో పోలింగ్ ఘట్టం కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా, ఒకింత మందకొడిగానే ఈ ప్రక్రియ జరుగుతోంది. ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమాతో ఉన్నాయి. తమకు కలిసి వచ్చే అంశాలేమిటి, ప్రతికూలఅంశాలేమిటని లెక్కలు వేసుకుంటున్నాయి. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నాయి. కేంద్రంలో ఈసారి హంగ్ ఏర్పడుతుందని, 16సీట్లు గెలుచుకుంటే చక్రం తిప్పొచ్చని టీఆర్ఎస్ భావిస్తుంటే.. ఇక్కడ వీలైనన్ని సీట్లతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తోడుగా నిలవాలని రాష్ట్ర కాంగ్రెస్ యోచిస్తోంది. అటు నార్త్ ఇండియాలో సీట్లు తగ్గవచ్చన్న అంచనాలతో దక్షిణ ప్రాంతంలో ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.


రాష్ట్రంలో టీఆర్ఎస్  తన పట్టును నిలుపు కుంటూ ప్రాంతీయ పార్టీల కూటమితో కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా 16 సీట్లు సాధించాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చింది. ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకుని ముస్లింల మద్దతును కూడగట్టే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాష్ట్రంలోని అన్ని సీట్లను గెలుచుకుని జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు ఒక నాయకత్వం వహించాలన్న రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహం మేరకు పార్టీ నేతలు పనిచేశారు. రాష్ట్ర మంత్రులకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహిం చారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కేంద్రీకరించి ఇక్కడి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజానీకానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చి పార్టీ విజయానికి బాటలు వేశారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో విజయం సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని, తద్వారా రాష్ట్రానికి భారీఎత్తున నిధులు తెచ్చుకోవచ్చునని భావిస్తున్నారు. అలాగే కేంద్రంలో కూడా టీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైతే విభజన చట్టంలోని హామీలు సాధించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పొందవచ్చునని టీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నా రు.


 

కాంగ్రెస్‌ పార్టీ పూర్వవైభవాన్ని తెచ్చుకుని మళ్ళీ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు జాతీయ నాయకుల సందేశాలతో ప్రజల వద్దకు వెళ్ళారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్‌ పడిపోవడం, మరోవైపు ప్రాంతీయ పార్టీలు బలం పుంచుకోవడంతో పాటు కాంగ్రెస్‌ కూడా దేశవ్యాప్తంగా పోటీ చేయడంతో యుపిఎ-3 ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాతో రాష్ట్ర నాయకులు ఎన్నికల బరిలో గట్టి పోటీని ఇచ్చేందుకు కృషి చేశారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే విధంగా ‘న్యాయ్‌’ సంక్షేమ పథకం ద్వారా ఏటా రూ.72 వేల ఆదాయం కల్పిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనను తమ నినాదంగా తీసుకుని కాంగ్రెస్‌ నేతలు ఉత్సాహంగా జనంలోకి వెళ్ళారు. భాజపా పేదల సంక్షేమానికి సంబంధించిన ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో న్యాయ్‌ నినాదం తమను గెలిపిస్తుందన్న ధీమాతో కాంగ్రెస్‌ నాయకులు ప్రజల్లోకి వెళ్ళారు.


 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఆశతో రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశం కోసం బీజేపీని మళ్ళీ గెలిపించాలని కోరుతూ రాష్ట్ర నేతలు ప్రచారం సాగించారు. కేంద్రంలో నరేంద్రమోడీకి మద్దతుగా రాష్ట్రం నుంచి కనీసం ఆరుగురు ఎంపీలను పార్లమెంట్‌కు పంపించాలంటూ బీజేపీ నేతలు ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ళుగా నరేంద్రమోడీ పరిపాలనపై ప్రజలకు వివరిస్తూ,టీఆర్ఎస్ పై అప్పుడప్పుడు విమర్శలు చేస్తూ వచ్చారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు స్పష్టమవుతున్నందున రాష్ట్రంలో కూడా అభివృద్ధి నిధులు సాధించేందుకు తమకు మద్దతు ప్రకటించాలంటూ బీజేపీ నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రాంతీయ పార్టీల కూటమి కేంద్రంలో అధికారాన్ని కొనసాగించలేదని, జాతీయ పార్టీగా మళ్ళీ తమకే మద్దతు ఇవ్వాలంటూ ప్రచారంలో హోరెత్తించారు. దేశ భద్రత, సమర్థ, అవినీతిరహిత పాలన, ఆర్థిక వ్యవస్థ పటిష్టం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు ప్రజలకు వివరించేందుకు ప్రయత్నించారు.  


స్థూలంగా తెలంగాణలోని 17 సీట్లపై ఒక ప్రాంతీయ పార్టీ, రెండు జాతీయ పార్టీలు భారీ ఆశలే పెట్టుకున్నాయి. అయితే, ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలుపొందనున్నారు? వారి కల నెరవేరుతుందా అనేది తెలిసిందుకు మే 23 వరకు వేచి చూడాల్సిందే. అయితే, పోలింగ్ సరళి ఆధారంగా 11వ తేదీ సాయంత్రం వరకు ఒక క్లారిటీకి రావచ్చని పలువురు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: