ఏపీ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ భరితంగా ముగిసిపోయినాయి. అయితే ఫలితాల కోసం ఇంకా 40 రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి. అయితే ఐవీఆర్ ఎస్ విధానంలో ప్రజలు ఫోన్లు చేసి వారు ఎవరికి ఓటేశారో కనుక్కునే ప్రయత్నం జరుగుతోంది. 8667124557 నంబర్ నుంచి ఫోన్ చేసి చేస్తున్న ఈ సర్వేలో... టీడీపీకి ఓటు వేసి ఉంటే 1 - వైసీపీకి ఓటేస్తే 2 - జనసేనకు ఓటేస్తే 3 - కాంగ్రెస్ కు ఓటేస్తే 4 - ఇతరులకు ఓటేస్తే 5 నొక్కాలి అని అడుగుతున్నారు.


ఇది ఎవరో అనధికారికంగా చేయిస్తున్న సర్వే అని అర్థమవుతోంది. అయతే దీనివెనుక టీడీపీ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్ కు ముందు చంద్రబాబు ఇప్పటికే నాలుగైదు సార్లు IVR సర్వే చేయించారు. ప్రభుత్వ పనితీరుపై పథకాల అమలుపై ప్రజలకు పథకాలు చేరుతున్నాయా లేదా అనే అంశం పై - ప్రభుత్వం సంతృప్తిగా పనిచేస్తుందా లేదా అనే అంశాలపై సీఎం చంద్రబాబు వాయిస్ తో ఆ సర్వేలు జరిపారు.


నేను మీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాట్లాడుతున్నాను. ప్రభుత్వ పనితీరుపై మీకు సంతృప్తిగా ఉంటే 1 నొక్కండి... సంతృప్తిగా లేకపోతే 2 నొక్కండి అని ఆ సందేశం వచ్చేది. ప్రస్తుతం జరుగుతున్న సర్వేకూ ప్రభుత్వానికీ ఎలాంటి సంబంధమూ లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సర్వేలో నియోజకవర్గం పేరు అడగడం లేదు. అయినప్పటికీ మొబైల్ నంబర్ ఆధారంగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఏ నియోజకవర్గ ఓటరో తెలుసుకోవడం సమస్యేమీకాదు. దాంతో ఈ సర్వేలో ఎవరికి ఓటేశామో చెబితే ఆ నియోజకవర్గం ఫలితం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: