తెలంగాణ‌ రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జెండా ఎత్తేసిన టీడీపీ మళ్లీ ఉనికిలోకి వచ్చేందుకు ప్ర‌యత్నిస్తున్నది. లోక్‌సభ ఎన్నికలకు దూరం ఉన్న పచ్చపార్టీ.. రానున్న పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల్లోనైనా పొత్తు పెట్టుకుందాంమంటూ కాంగ్రెస్‌ను ఇప్ప‌టి నుంచే అభ్య‌ర్థిస్తోంది. అడ్వాన్స్ దేబిరింపులు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.


అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీడీపీ.. పంచాయతీ ఎన్నికల్లో పత్తాలేకుండా పోయింది. తాజాగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఊసెత్తేవారే లేకపోవడంతో వారు దిక్కుతోచనిస్థితిలో పడిపోయారు. పేరుకు జాతీయ పార్టీ తెలంగాణలో కూడా బలంగా ఉన్నామని ప్రకటించుకున్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో 17 మంది కూడా పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ ప‌రువు గంగ‌పాలు అయింది. 


కాగా, సొంతంగా బరిలో దిగలేని తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ వ్యతిరేక ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలోతొక్కి పొత్తు కోసం ప్రయత్నిస్తున్నది. టీడీపీ కార్యాలయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో అవగాహనతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలే కాకముందే టీడీపీలో పోటీ భయం నెలకొందని, అందుకే అడ్వాన్స్‌గా పొత్తుల దేబరింపుల కోసం వారి వెంట పడుతున్నదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: