అదేంటో శతృవులను పెంచుకునే విషయంలో చంద్రబాబునాయుడు బాగా ఉత్సాహం చూపుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నిజంగా పోరాడింది ఎవరిపైనో చెప్పమంటే టిడిపి నేతలు కూడా బుర్రగోక్కోవాల్సిందే. ఎందుకంటే, ఏ రోడ్డు షోలో చూసినా ఎక్కడ బహిరంగసభలో మాట్లాడినా కాసేపు జగన్మోహన్ రెడ్డి, కొద్దిసేపు కెసియార్ తర్వాత నరేంద్రమోడిని ఎంతలా తిట్టారో అందరూ చూసిందే.  తాజాగా ఎన్నికల కమీషన్ వంతు వచ్చింది. అవును తన శతృవుల జాబితాలో  చంద్రబాబు కొత్తగా ఈసిని కూడా చేర్చారు.

 

చంద్రబాబుకు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా దాన్ని ఎవరో ఒకరిపై నెట్టేసి వారిని అమ్మనాబూతులు తిట్టి కసి తీర్చుకోవటం చాలా ఆనందం. మొన్నటి వరకే కాదు ఇపుడు కూడా జగన్ అలాగే తిడుతున్నారు. ఇపుడు కొత్తగా ఎన్నికల కమీషన్ మీద కూడా అలాగే మండిపడుతున్నారు. టిడిపిని ఓడించేందుకే ఎన్నికల కమీషన్ ఏపి ఎన్నికలను మొదటి షెడ్యూల్లోనే పెట్టిందంటూ పాత పాటనే కొత్తగా అందుకున్నారు. నిజానికి ఎన్నికల షెడ్యూల్ ను నిర్ణయించేది, ప్రకటించేది కేంద్ర ఎన్నికల కమీషన్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఏ రాష్ట్రానికి ఏ మేరకు కేంద్ర బలగాలను పంపాలన్న విషయాన్ని తేల్చాల్సింది కూడా సిఈసినే అన్న విషయం చంద్రబాబుకు తెలీకుండా ఉంటుందా ? ఎందుకు తెలీదు బాగా తెలుసు. అయినా ఎన్నికల కమీషన్ ను నోటికొచ్చినట్లు తిట్టి తన కసినంతా తీర్చుకుంటున్నారు. ఈవిఎంలు మొరాయిస్తే దానికి ఎన్నికల కమీషన్నే తప్పు పడుతున్నారు. కొన్ని చోట్ల ఈవిఎంలు మొరాయించింది వాస్తవమే. మరికొన్ని చోట్ల ఈవిఎంల్లో ప్రాబ్లెం వల్ల ఓటింగ్ ఆలస్యమైంది కూడా నిజమే. అంతమాత్రాన ఈసీని నోటికొచ్చినట్లు శాపనార్ధాలు పెట్టటమేనా ?

 

ప్రధాన కార్యదర్శిని మార్చటం, ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేయటం, ఎస్పీలపై బదిలీ వేటు వేయటం లాంటి విషయాల్లో ఏకంగా ఈసి అధికారాలనే మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. హై కోర్టులో చివాట్లు తిన్నా కూడా బుద్ది రాలేదు. ఈ విషయాలను తేల్చుకోవటానికి శనివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషన్ ను కలుస్తానంటున్నారు. పైగా ప్రధాన కార్యదర్శిని జగన్ సహ నిందితుడని, జగన్ కోవర్టని మీడియాలో చెప్పిన తన అక్కసునంతా తీర్చుకుంటున్నారు. చంద్రబాబుకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో ?

 

గతంలో ఎవరూ ఈసి అధికారాలను ప్రశ్నించలేదు. ఎన్నికల సమయంలో బదిలీలు సర్వ సాధారణమే. ఈ విషయంలో ఎన్నికల కమీషన్ అధికారాలను ఎవ్వరూ ప్రశ్నించేందుకు లేదన్న కనీస ఇంగితం కూడా చంద్రబాబు మరచిపోతున్నారు. అన్నీ తెలిసి కూడా ఈసితో గొడవకు దిగుతున్న చంద్రబాబును చూసి ఏమనాలో టిడిపి నేతలకే అర్ధం కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: