అప్పుడెప్పుడే అసెంబ్లీ రౌడీ అనే సినిమా వచ్చింది గుర్తుంది కదా ? సినిమా టైటిల్ పై అప్పట్లో రాజకీయపార్టీలు పెద్ద రచ్చే చేశాయి. అయినా టైటిట్ ను మార్చలేదనుకోండి అది వేరే సంగతి. అప్పట్లో ఆ సినిమా పెద్ద హిటయ్యింది. ఇదంతా ఇప్పుడెందుకంటే పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు అసెంబ్లీ ఎంఎల్ఏ చింతమనేని వ్యవహారశైలి సరిగ్గా పై టైటిల్ కు సరిపోతుంది.  ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని కొడుతూనో లేకపోతే బూతులు తిడుతూనో ఉంటారు.

 

ఇక ప్రస్తుతానికి వస్తే పోలింగ్ రోజు నుండి ఈరోజు వరకూ చింతమనేని ఎక్కడా అడ్రస్ లేరని సమాచారం. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు కూడా గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఓటింగ్ జరిగిన నాలుగు రోజుల తర్వాత కూడా కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు.  వైసిపి నేతలను లేకపోతే వైసిపికి పని చేశాడని ప్రచారంలో ఉన్న నేతలను వెంటపడి మరీ దాడులు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో  సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ఇంటిపై దాడి చేసిన విషయం అందరూ చూసిందే.

 

అలాంటిది దెందులూరులో చింతమనేని వ్యవహారశైలి మాత్రం  రివర్సులో ఉంది. నిజానికి పోలింగ్ విషయంలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. మొదటిదేమో మొదటినుండి చింతమనేనికి అండగా ఉన్న కమ్మ సామాజికవర్గంలోని చాలా మంది ఓట్లు వేయలేదని. ఇక రెండో వాదన ఏమిటంటే,  కమ్మ సామాజికవర్గం ఓట్లు మాత్రమే చింతమనేనికి పడ్డాయని, కమ్మేతర సామాజిక వర్గ ఓట్లు ప్రత్యేకంగా బిసిలు, ఎస్సీలు పూర్తిగా వైసిపికి పడ్డాయనే ప్రచారం కూడా ఎక్కువగా ఉంది.

 

మామూలుగా అయితే ఎన్నికల రోజు కానీ తర్వాత కానీ దెందులూరులో బాగా గొడవలు జరుగుతాయని అందరూ అనుకున్నారు. అందుకు చింతమనేని చరిత్రే కారణం. కానీ ఆశ్చర్యంగా పోలింగ్ రోజు నుండి ఇంత వరకూ నియోజకవర్గంలో ఎక్కడా చింతమనేని కనబడలేదు. ఒక్క గొడవ కూడా లేదు. ఎవరితోను గొడవ పడ్డట్లు కూడా వినబడలేదు. ఐదేళ్ళల్లో ఎంతోమందిపై చింతమనేని కేసులు పెట్టించారు. తన వ్యవహార శైలి వల్ల చాలా మందితో శతృత్వం కొనితెచ్చుకున్నారు.

 

నియోజకవర్గం నుండి వస్తున్న సమచారం ప్రకారమైతే చింతమనేని ఓటమి ఖాయమట. అదే ఫీడ్ బ్యాక్  బహుశా ఎంఎల్ఏకి కూడా వచ్చే ఉంటుంది.  అలాంటిది నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం చింతమనేనిలో భయమే అంటున్నారు. తాను ఓడిపోతే పరిస్ధితేంటి అనే టెన్షన్ చింతమనేనిని కుదిపేస్తోందట. అందుకనే ఇప్పుడున్న కేసులు కాకుండా కొత్తగా మరిన్ని సమస్యలు తెచ్చుకోవటం ఎందుకనే ఎంఎల్ఏ మౌనంగా ఉన్నట్లు అనుకుంటున్నారు. మరి చూద్దాం ఏమవుతుందో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: