తనకు నచ్చని విషయాల్లో చంద్రబాబునాయుడు ఎప్పుడైనా ఇలాగే చేస్తుంటారు. ఏం చేసినా గంగిరెద్దులా తలూపే మీడియా ఉండనే ఉందికదా ? అందుకే తానేం చేసినా అడిగేవాళ్ళు లేరన్న ఉద్దేశ్యంతో తాజాగా ఎన్నికల సంఘం పైన కూడా రెచ్చిపోతున్నారు. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈసీపై చంద్రబాబు ఎందుకంతలా రెచ్చిపోతున్నారు ? ఎందుకంటే అందుకు కొన్ని కారణాలున్నాయి.

 

ఐదేళ్ళ పాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. అదే సమయంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డికి జనాలు సానుకూలంగా స్పందించారు. పాదయాత్రలో ఏ జిల్లాలోకి అడుగుపెట్టినా జనాలు బ్రహ్మరథం పట్టిన విషయం అందరూ చూసిందే. దాంతో చంద్రబాబు ఓ ఆలోచన చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఈవిఎంల ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా జరిపించాలని.

 

పేపర్ బ్యాలెట్ ను తానొక్కడే డిమాండ్ చేస్తే సాధ్యంకాదు. అందుకనే దాదాపు ఆరుమాసాలగా జాతీయస్ధాయిలో కొన్ని పార్టీలను కలుపుకున్నారు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఎన్నికల కమీషన్ పట్టించుకోలేదు. పేపర్ బ్యాలెట్ తో పోలింగ్ సాధ్యం కాదని తేలిపోగానే ప్లాన్ బిని అమలు చేశారు చంద్రబాబు. అదేమిటంటే ఎన్నికల నిర్వహణలో తమ మాట వినే సిబ్బందిని విధుల్లో ఉండేట్లుగా చూసుకోవటం.

 

ముందుగా అనుకున్నట్లే చాలా చోట్ల టిడిపి నేతల విద్యాసంస్ధల్లో పనిచేసే సిబ్బందినే పోలింగ్ కేంద్రాల్లో అధికారులుగా నియమించుకున్నారు.  ప్లాన్ బి ద్వారా ఇటు పార్టీల ఏజెంట్లను అటు ఓటర్లను మాయ చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనబడింది. ఎటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు కలెక్టర్లు, ఎస్పీలుగా తన మనుషులనే నియమించుకున్నారు.  మొత్తం స్టేజ్ సెట్ చేసుకుని ఎన్నికలకు రెడీ అయ్యారు.

 

ఇక్కడే చంద్రబాబుకు ఊహించని ట్విస్టు ఎదురైంది. చంద్రబాబు వ్యూహాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న వైసిపి ఒక్కసారిగా ఎదురుదాడి మొదలుపెట్టింది. ఫలితంగా  ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు ఇద్దరు ఎస్సీలపై దెబ్బపడింది. తర్వాత అధికార పార్టీ నేతల విద్యాసంస్ధల్లో పనిచేసే సిబ్బందిని విధుల్లో ఎలా ఉపయోగిస్తారనే అభ్యంతరాలను లేవదీసింది.  దాంతో విషయం గ్రహించిన ఈసీ మొత్తం సిబ్బందిని మార్చేసింది.

 

ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ విషయంలో చంద్రబాబు చెప్పినట్లు విని ఓవర్ యాక్షన్  చేసిన  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వేటు వేసింది. చివరగా ప్రకాశం జిల్లా ఎస్పీని కూడా మార్చేసింది.  మధ్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్ధానిక రెవిన్యు, పోలీసు అధికారులనూ మార్చేసింది. ఊహించని రీతిలో ఈసి తీసుకున్న వరుస చర్యలు  చంద్రబాబు ఉక్కిరిబిక్కిరయ్యారు.

 

ఏదో మాయచేసి ఎన్నికల్లో గట్టెక్కాలని అనుకున్న చంద్రబాబుకు ఈసీ చర్యలతో చేతులు, కాళ్ళు కట్టేసి నీళ్ళల్లోకి తోసినట్లుగా అయిపోయింది. ఎంతటి గజీతగాడైనా కాళ్ళు, చేతులు కట్టేసి నీళ్ళల్లో తోసేస్తే ముణిగిపోవటం తప్ప చేయగలిగేదేమీ ఉండదు. ఇపుడు చంద్రబాబు పరిస్ధితి అలాగే ఉంది. అందుకనే  ప్రస్తుత తన పరిస్ధితికి  కారణమైన ఎన్నికల కమీషన్ పై అందుకే చంద్రబాబు తీవ్రంగా మండిపోతున్నారు.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: