తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన డాటాచోరీ కేసు దర్యాప్తు మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతోంది. టీడీపీకి మేలు చేసేందుకు ఐటీగ్రిడ్స్ సంస్థ చేసిన వ్యవహారంపై సిట్ అధికారులు విచార‌ణ‌లో క‌ల‌క‌లం రేపే నిజాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించిన సిట్ బృందానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికతో అస‌లు గుట్టు వెలుగులోకి వ‌స్తోంది. గతంలో ఐటీ గ్రిడ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఏడు హార్డ్‌డిస్క్‌లను విశ్లేషించిన ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు.. తాజాగా మరో 40 హార్డ్‌డిస్క్‌లను విశ్లేషించి నివేదిక అందజేశారు.


పాత ఏడు స‌హా తాజా 40 హార్డ్ డిస్క్‌ల‌ను ఫోరెన్సిక్ అధికారులు విశ్లేషించారు. ఆయా హార్డ్ డిస్క్‌ల‌లోని  పూర్తి వివరాలను రిట్రీవ్ చేయగా, లబ్ధిదారుల డాటా పూర్తిగా ఆయా ప్రభుత్వశాఖల్లోని అధికారుల దగ్గర నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అక్రమదారుల్లో సేకరించిన ప్రజల వ్యక్తిగత డాటాను ఐటీగ్రిడ్ నిర్వాహకులు.. హైదరాబాద్‌కు చెందిన ఓ వెబ్‌సర్వీస్ కంపెనీలో పొందుపర్చారని, దీనికోసం సదరు కంపెనీకి టీడీపీకి చెందిన నాయకుల నుంచి భారీగా సొమ్ము ముట్టజెప్పినట్టు గుర్తించినట్టు తెలిసింది. క్రెడిట్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ తదితర లావాదేవీలు పరిశీలించి అధికారులు ఈ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఆధార్ అధికారులు సైతం తమ డాటాను ఐటీగ్రిడ్స్ సంస్థ చోరీచేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిట్ అధికారులు అన్నికోణాల్లో విచారణ చేపట్టారు. కేసులో కీలక నిందితుడు అశోక్‌రెడ్డిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.


ఐటీ గ్రిడ్స్ సంస్థ.. అడ్డదారిలో ఆధార్ సంస్థలోని సీఐడీఆర్ ( సెంట్రల్ ఐడెంటిటీస్ డాటా రిపోసిటరీ) లేదా ఎస్‌ఆర్డీహెచ్ (స్టేట్ రెసిడెంట్ డాటా హబ్) లింక్‌లోకి ప్రవేశించి సమాచార చౌర్యానికి పాల్పడిందని ప్రాథమికంగా తేలింది. ఆధార్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ టీ భవానీ మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం స్పష్టమైంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద ఉండాల్సిన సమాచారం ఈ సంస్థకు చేరినట్టు నిర్ధార‌ణ అయింది. ఐటీగ్రిడ్స్ సంస్థ దగ్గర ఉన్న సమాచారం. ఆధార్‌తో సంబంధం ఉన్న సీఐడీఆర్ లేదా ఎస్‌ఆర్డీహెచ్ నుంచి అక్రమంగా పొందారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: