విభజన తరువాత ఏపీ అన్ని రకాలుగా నష్టపోయిందని, కట్టు బట్టలతో తరిమేశారని మన పాలకులు చెబుతూ వచ్చారు. ఏపీ కోలుకోవాలంటే కనీసం రెండు దశబ్దాల కాలం పడుతుందని, మిగిలిన రాష్ట్రాలతో రీచ్ అవ్వాలంటే అర్ధ శతాబ్ధ కాలం పడుతుందని కూడా ఆర్ధిక నిపుణుల అంచనాలు ఉన్నాయి. 


అయితే ఈసారి ఎన్నికల ఖర్చు చూస్తే మాత్రం ఏపీని ఎవరూ పేద రాష్ట్రం అనుకోరేమో. అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఈసారి ఎన్నికల్లో చేసిన  ఖర్చు అక్షరాలా 10 వేల కొట్ల రూపాయల పైమాటగా ఉంది. ఇది ఇంకా ఎక్కువే   కానీ తక్కువ కాదని కూడా చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంతో  పాటు, ఓటర్లకు తాయిలాలు, ఓటుకు నోటు ఇలా అన్నీ కలుపుకుంటే ఒక్కో అభ్యర్ధి తక్కువల్లో తక్కువగా  20 కోట్ల మేర ఖర్చు చేశారని తొలి అంచనాలు చెబుతున్నాయి. 


ఇక ఏపీలో ఎన్నీక‌లు నిర్వహించడానికి కేంద్రం మూడు వందల కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరో మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. సర్కారీ ఖర్చు ఇలా ఆరువందల కోట్లు ఉంటే అభ్యర్ధులు పెట్టిన ఖర్చు వేలల్లో ఉండడం దారుణమే. ఎన్నికల నిబంధనలకు విరుధ్ధంగా భారీ ఎత్తున ఓట్ల కొనుగోలుకు తెర లేపడం, నాయకులను కూడా ఎక్కడికక్కడ కొనేయడం వంటి వాటిని  ఈసారి ఎన్నికల్లో చూశామని మేధావులు చెబుతున్నారు.


ఇక ఇంతా చేసే ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్ధికి నెల జీతం లక్షా ముప్పయి వేలు మాత్రమే  ఏపీ సర్కార్ వేతనంగా ఇస్తుంది. దానికి ఇతరత్రా  అలవెన్సులు కలుపుకున్నా మూడు లక్షలు అవుతాయి.  అంటే  ఈ ఆదాయం అయిదేళ్ల కాలానికి కోటిన్నర కంటే మించదు.  ఈ మొత్తం కోసం ఇరవై కోట్లు పైగా పెట్టుబడి పెట్టి ఎవరూ ఎమ్మెల్యే కారన్నది అందరినీ తెలిసిందే. అంటే ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఇతరత్రా వ్యాపారాలు, వ్యాపకాలు విస్తరించుకోవడానికి దీన్ని ఓ సాధనంగా  చేసుకుంటారన్నది వాస్తవం. 


మరి పేద రాష్ట్రం అని ఓ వైపు చెబుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్ధులు చేసిన ఖర్చు చూస్తే దిమ్మ దిరిగిపోతుంది. నిజంగా ఏపీ పేద రాష్ట్రమా అంటే  నూటికి తొంబై శాతం బీదా బిక్కీ ఉన్న పేద రాష్ట్రమే. ఇక్కడ నాయకులే బాగా డబ్బున్న వారు అన్నది ఈసారి ఎన్నికలు గట్టిగా నిరూపించాయి. రాజకీయ అవినీతిని అతి పెద్ద నేరంగా చూడనంతవరకూ ఈ తరహా అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతూనే  ఉంటాయని  మేధావులు అంటున్నారు. మరి పరిస్థితి మారుతుందా. ఇప్పటికైతే నిరాశే జవాబు అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: