ఈసారి ఎన్నికల్లో ఓ ముఖ్యమైన అంశం ఒకటి  కనిపించింది. ఇది మీడియాలో  పెద్దగా హైలెట్ కాలేదు కానీ ఏపీకి సంబంధించినంతవరకూ కీలకమైనదే అని చెప్పాలి. తెలుగు రాష్ట్రం ఏర్పడ్డాక ఇటువంటి పరిణామం ఇంతకు ముందు ఎపుడూ జరగలేదు. ఓ విధంగా ఇది మంచికా, చెడ్డకా అన్నది కూడా ఆలోచన చేయాలి. ఆ నీడ నుంచి బయటపడి ఏపీ సొంత రాజకీయం చేసుకుంటూ ముందుకు పోయిందనుకొవాలో లేక ఇదే అనివార్యమైందనుకోవాలో అర్ధం కాని స్థితి.


ఏపీలో తొలిసారి జాతీయ పార్టీల ప్రమేయం లేకుండా 2019 ఎన్నికలు జరిగాయి. టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడు   ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ, ప్రచారం సాగింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఉనికి లేని తొలి ఎన్నికలుగా వీటిని చూడాలి. ఏపీలో ఇది కొత్త పరిణామమే. జనాలు సైతం దీన్ని ఆమోదించినట్లుగా కనిపిస్తోంది. 2009 వరకూ కాంగ్రెస్ ని ఆదరించిన ఏపీ ప్రజలు విభజన తరువాత పాతర వేశారు.  ఆ తరువాత మరో జాతీయ పార్టీగా బీజేపీ ముందుకు వచ్చింది.


ఆ పార్టీ ప్రత్యేక హోదాతో పాటు అనేక హామీలను ఇచ్చి 2014 ఎన్నికల్లో  టీడీపీతో పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలకు బంపర్ మెజారిటీ  ఆఫర్ ని జనం ఇచ్చారు. అయితే అయిదేళ్ళలో హామీల భంగం తప్ప మరేమీ మిగలలేదు. దీంతో ఈసారి రెండు పార్టీలను జనం నమ్మడం మానేశారు. ఇక ఇపుడు ఏపీ రాజకీయ మైదానంలో ఉన్నవి ప్రాంతీయ పార్టీలే. అంటే ఓ విధంగా తమిళనాడు కల్చర్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలే రేపటి రోజున కేంద్రంలో చక్రం తిప్పుతాయి. ఆ విధంగా ఏపీ ప్రయోజనాలను కాపాడుతాయని భావించి జనం ఆదరించి ఉంటారనుకోవాలి.


ఇపుడు జాతీయ పార్టీలకు ఏపీలో ఒక్క సీటు రాదు కాబట్టి కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషిస్తాయి. అయితే అక్కడ సంకీర్ణ సర్కార్ ఏర్పడి సీట్ల అవసరం పడినపుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.  అటు ఎండీయేకైనా, ఇటు యూపీయే కూటమికైనా పూర్తి మెజారిటీ కనుక వస్తే మాత్రం ఏపీకి తిప్పలు తప్పవు. ఆయా కూటముల్లో బేషరతుగా చేరి ఉనికి చాటుకోవడచే  తప్ప ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను కాపడడం కష్టమవుతుంది.


అందుకే ఏ పార్టీకి అక్కడ పూర్తి మెజారిటీ  రాకూడదని ఏపీ ప్రజలు ఇపుడు గట్టిగా కోరుకుంటున్నారు.  ఎపీ నుంచి  కాంగ్రెస్, బీజేపీ నేరుగా గెలిచి హామీలు ఇచ్చిన దానికే దిక్కు లేదు. ఇపుడు ఏపీ ప్రమేయం లేకుండా ఒకవేళ  కేంద్రంలో సర్కార్ ఏర్పడితే అది ఏపీకి గట్టి షాక్ మాత్రమే కాదు. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లే. అపుడు ఆర్ధికంగా ఏపీ చిక్కుల్లో పడడం ఖాయమని మేధావులు అంచనా వేస్తున్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: