తెలుగుదేశం పార్టీ పుట్టింది.  అన్న నందమూరి తారక రామారావు నట్టింట. ఓ విధంగా ఆ పార్టీ రామారావు మానసపుత్రిక. పార్టీ పెట్టి ప్రజలకు తోచిన విధంగా సేవ చేయాలనుకున్నారు అన్న గారు. అరవయ్యేళ్లకు సినిమా రంగానికి ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన  అన్న గారికి ఎదురులేని పరిస్థితి కల్పించింది అప్పటి కాంగ్రెస్ పార్టీయే.



దానికి తోడు మెండుగా ఉన్న సినీ గ్లామర్ కూడా ఆయన్ని సీఎం చేసేసింది. అయితే ఆ గ్లామర్  పాల పొంగు చప్పబడడానికి గట్టిగా  ఏడాదిన్న కాలం కూడా పట్టలేదు. నాదెండ్ల  భాస్కర రావు ఎపిసోడ్ తరువాత టీడీపీ పని అయిపోయిందనుకున్నారు.  అయితే పార్టీలో అపుడే ప్రవేశించిన చంద్రబాబు తనదైన క్యాంప్ పాలిటిక్స్ కి తెర తీసి టీడీపీ మనుగడ కాపాడారు. ఆ తరువాత 1985న మరో మారు పార్టీ అధికారంలోకి  వచ్చింది. ఆ మీదట టీడీపీలో చంద్రబాబు పాత్ర బాగా పెరిగింది.



ఇక పార్టీకి గ్లామర్ ఒక్కటే సరిపోదని గ్రామర్ కూడా ఉండాలని భావించి బలమైన క్యాడర్ని నిర్మాణం చేసిన ఘనత మాత్రం చంద్రబాబుదే. కార్యకర్తల పార్టీగా టీడీపీని ఆయన తీర్చిదిద్దారు. 1995 ఆగస్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ  గ్లామర్ ఓడింది, బాబు గారి రాజకీయ గ్రామరే గెలిచింది. ఆ తరువాత ఎన్నో ఎన్నికలను ఒంటిచేత్తో ఎదుర్కొన్న చంద్రబాబు గ్లామర్ కంటే తన గ్రామరే శ్రీరామ రక్ష అని నమ్ముకున్నారు. అందువల్లనే ఎందరు మెగాస్టార్లు వచ్చినా మరెందరూ స్టార్లు వచ్చినా పొలిటికల్ స్టార్ల గ్లామర్ ఎదురైనా బాబు గారి గ్రామరే ఎపుడూ గెలుస్తూ వస్తోంది. 


నిజానికి చంద్రబాబుకు ఎటువంటి జన సమ్మోహనమూ లేదంటారు. కానీ అటువంటి మైనస్ నుంచి బయటకు వచ్చి పొలిటికల్ గ్రామర్ తోనే ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ఇమేజ్ తో ఢీ కొట్టినా బాబు మాత్రం తాను స్రుష్టించుకున్న సొంత ఇమేజ్ తోనే నెగ్గుకుని వస్తున్నారు. ఆయన ప్రసంగాలు ఆకట్టుకునేలా ఉండవు, ఆయన సినిమా స్టార్ కాదు, జనాన్ని సూదంటు రాయిలా లాగేసే శక్తియుక్తులు ఆయనకు లేవు. కానీ ఆయన విజయ సూత్రం మాత్రం ఎపుడూ గ్రామరే. అదే ఆయన్ని కాపాడుతూ వస్తోంది. మరి అది  ఈసారి ఎన్నికల్లో ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఏది ఏమైనా  ఈ రోజు  70వ పడిలో పడిన బాబు నూరేళ్ళ పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటోంది యావత్తు ప్రజానీకం.


మరింత సమాచారం తెలుసుకోండి: