ఏపీలో ఎన్నికలు నువ్వా నేనా అన్న రేంజిలో సాగాయి. ఇవి అలాంటి ఇలాంటి ఎన్నికలు కావు. ప్రధాన పార్టీలైన టీడీపీకి, వైసీపీకి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఎవరు ఓడినా రాజకీయంగా గడ్డు పరిస్థి ఎదురవడమే కాదు, ఓ విధంగా ఏపీ రాజకీయ తెరపై కనుమరుగు కావాల్సివస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. అంటే ఈ ఎన్నికలు ఎవరికైనా చివరివి అన్న మాట.


మరి అటువంటి కీలకమైన ఈ ఎన్నికల విషయంలో వైసీపీ సర్వ శక్తులు ఒడ్డి పోరాడింది. గెలుపే సర్వస్వంగా  పార్టీ మొత్తం కసిగా పనిచేసింది. పోలింగ్ సరళి కూడా అనుకూలంగా  ఉందని భావిస్తున్నారు.  కనీసంగా వంద సీట్లు వస్తాయని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది, కానీ ఒకవేళ అనుకున్న అంచనాలు తప్పి సీట్లు తగ్గినా, లేక మెజారిటీకి ఒకటి రెండు సీట్లు అవసరం పడినా చేయాల్సిన పని బోలెడు ఉంటుంది  ప్రీ  పోల్ వరకూ బాగానే పనిచేసిన వైసెపీ గెలిచేస్తామన్న ధీమాలో పోస్ట్ పోల్ కసరత్తుని పక్కన పెట్టేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.


ఒకవేళ ఈ కారణం చేతనైనా వైసీపీకి సీట్లు తక్కువపడి మ్యాజిక్ ఫిగర్ కి కొంచం అటు ఇటుగా ఉంటే అపుడేంటి పరిస్థితి అన్న దాని మీద కూడా ఇపుడు ఏపీలో వాడి వేడిగా చర్చ సాగుతోంది. వైసీపీ విషయం తీసుకుంటే ఒంటరిగా పోరాడింది. పొత్తులు అసలు  ఉండవని నిక్కచ్చిగా తేల్చేసింది. మరో వైపు అన్ని పార్టీలు ఎవరు మటుకు ఎలా ఉన్నా వైసీపీకి చాలా  దూరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా కూడా జనసేనతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఒకవేళ సీట్లు తగ్గినా సైకిల్ కి బ్రేకులు పడకుండా పవన్ అండ ఉంటుందని అనఫీషియల్ టాక్.


మరి అదే టైంలో వైసీపీకి సీట్లు తగ్గితే పరిస్థితి ఏంటన్నది ఆ పార్టీ ఇంతవరకూ ఆలోచించుకోలేదని ఆ పార్టీ నేతల మాటల బట్టి చూస్తే అర్ధమవుతుంది. ఓ వైపు జనసేనని టార్గెట్ చేస్తున్నారు విజయసాయి. మరో వైపు వామపక్షాలు, కాంగ్రెస్ గెలుస్తాయని నమ్మకం లేదు కానీ ఒకవేళ వారిని ఒకటి రెండు సీట్లు వచ్చినా ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక బీజేపీ కూడా అంతే.  ఈ నేపధ్యంలో ప్లాన్ బీని టీడీపీ సిధ్ధం చేసుకుంటోంది. మరి వైసీపీ వద్ద అటువంటి ప్లాన్ ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి. 


హోరా హోరీగా సాగిన పోరులో బొటాబొటీగా సీట్లు రావచ్చునని, ఎవరికైనా 90 సీట్ల వరకూ  వస్తాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటువంటిది ఓ వేళ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో వచ్చి  వైసీపీ నిలిచిపోతే మాత్రం ప్లాన్ బీ ని అప్పటిక‌పుడు అమలు చేయాలనుకుంటే కుదరదు. రాజకీయాలో  పండిపోయిన టీడీపీ స్పీడ్ గా  ఆ చాన్స్ తీసేసుకుంటుంది. సో ఇప్పటినుంచి పోస్ట్ పోల్ విషయంలో  అనంతర పరిస్థితులు, కౌంటింగ్ విషయంలోనూ కసరత్తు వైసీపీకి అవసరం అని ఆ పార్టీ శ్రేయోభిలాషులు సైతం అభిప్రాయపడుతున్నారు.


తెలంగాణా ఎన్నికల వేళ కౌంటింగుకు ముందు కేసీయార్  సైతం మజ్లిస్ తో మంతనాలు జరపడాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అప్పట్లో మెజారిటీ ఎవరికీ రాదు అన్న పోస్ట్ పోల్ సర్వేలు చెప్పడంతో కేసీయార్ సైతం ముందు జాగ్రత్త పడ్డారు. మరి ఇపుడు ఏపీలో అంతకంటే  క్లిష్టమైన పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక్కడ బహుముఖ పోటీలే జరిగాయి. ఈ విషయంలో వైసీపీ ధీమా  ఎలా ఉన్నా ఓట్ల చీలిక భారీగా ఉంటుందన్నది వాస్తవం. మరి వైసీపీ వ్యూహాలేంటో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: