తిరుపతి స్వామి వారి బంగారం చెన్నైలో  ఎన్నికల సంఘం అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఇది పెద్ద వార్త. ఆ తరువాత జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు, చివరికి బంగారం క్షేమంగా టీటీడీ గూటికి చేరింది కానీ అసలు కధ అపుడే మొదలైంది. ఈ మొత్తం వ్యవహారంపై  పీ వైసీపీ సహా విపక్షాలు  ఆందోళన వ్యక్తం చేయడంతో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ తో ప్రత్యేక కమిటీని వేశారు.


ఈ మొత్తం వ్యవహారం ఇపుడు హాట్ హాట్ గా మారింది. ఆటు తిరిగి ఇటు తిరిగి ఎల్వీ, టీటీడీఎ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మధ్య వివాదంగా మారింది. ఈ సందర్భంగా టీటీడీ బంగారం పదిలంగా ఉందని, ఈ విషయంలో అతి ఉత్సాహం అవసరం లేదన్నట్లుగా సింఘాల్ మాట్లాడడం విశేషం. పైగా తాము అన్ని రకాలుగా చెక్ చేసుకుంటూనే ఉన్నామని, 2000  ఏడాది నుంచి  టీటీడీ బంగారం బ్యాంకుల్లో జమ చేయడం జరుగుతోందని సింఘాల్ చెప్పుకొచ్చారు.


ఎస్‌బీఐలో 5387 కిలోల బంగారం ఉందని చెప్పారు. టీటీడీకి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 18, 2016లో పీఎన్‌బీలో 1381 కిలోల బంగారం డిపాజిట్‌ చేసినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్‌ 18, 2019 నాటికి అది మెచ్యూరిటీ అయ్యిందన్నారు. మెచ్యూరిటీ అంశంపై మార్చి 27నే పీఎన్‌బీకి లేఖ రాశామని, బంగారం తరలింపు బాధ్యత పూర్తిగా పీఎన్‌బీదేనని సింఘాల్‌ స్పష్టం చేశారు.


పీఎన్‌బీవారు వచ్చి ట్రెజరీలో ఇస్తే అది టీటీడీ బంగారం అవుతుందని, ఈసీ సీజ్‌ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్‌బీ చెప్పిందని సింఘాల్ తెలిపారు. ఈసీ అధికారులకు డాక్యుమెంట్లు చూపినట్లు తమకు పీఎన్‌బీ అధికారులు ఫోన్‌లో చెప్పారన్నారు. వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో తమకు తెలియదన్నారు ఓ జాతీయ బ్యాంక్ నుంచి బంగారం టీటీడీకి తరలింపు జరుగుతోందంటే అందుకు ఆ బ్యాంకే బాద్యత కానీ తమది కాదని చేతులు దులుపుకున్నారు. బంగారం తమ వద్దకు వస్తుందన్న సమాచారం ఉంది కానీ ఎలా వస్తుందన్నది తమకు సంబంధం లేని విషయమని ఆయన చెప్పడం విశేషం. 


బంగారాన్ని వాళ్లు ఎలా తరలిస్తారో... ఏ వాహనంలో తీసుకొస్తారో ఎలా తెలుస్తుందని ఈవో ప్రశ్నించారు. ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌ 20న బంగారం అందజేశారని ఆయన అన్నారు. బంగారం వచ్చేంత వరకే....మిగిలిన విషయాలు తమకు అవసరం లేదన్నారు. బంగారం ఎలా వస్తే ఏంటి? బంగారం మాకు అందిందా అనేది ముఖ్యమని, కేజీ బంగారం డిపాజిట్‌ చేయాలన్నా బోర్డు నిర్ణయం తీసుకుంటామని ఈవో సింఘాల్‌ స్పష్టం చేశారు. మొత్తానికి ఈ బంగారం విషయంలో మాత్రం టీటీడీ స్పందిస్తున్న తీరు విడ్డూరంగా వుంది. పైగా విచారణకు ఆదేశించిన ఎల్వీపై సింఘాల్ విమర్శలు చేయడమూ దారుణమే.



మరింత సమాచారం తెలుసుకోండి: