ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల్లో గంద‌ర‌గోళం ఎపిసోడ్‌పై క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఇంట‌ర్ బోర్డ్ కార్యాల‌యం వ‌ద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు…విద్యార్థి సంఘాల నేతలు వచ్చి నిరసనలు తెలుపుతుండటం బుధ‌వారం సైతం కొనసాగింది. అధికారుల తీరుపై బోర్డు కార్యాలయం దగ్గరకు వచ్చిన విద్యార్ధులు మండిపడుతున్నారు. మార్కుల్లో తప్పులు వస్తే….కనీసం అధికారులు సమాధానం ఇవ్వటం లేదంటున్నారు.ఆన్ లైన్లో అప్లై చేసుకునేందుకు సైట్ ఓపెన్ కావటం లేద‌ని విద్యార్థులు వాపోతున్నారు. రెండు రోజులు గడువు పెంచినా…టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండటంతో ఏం చేయలేకపోతున్నామంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి….సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.


మ‌రోవైపు, ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో పోలీసులు క‌ట్ట‌దిట్ట‌మైన‌ బందోబ‌స్తు క‌ల్పించారు. లోపలికి ఎవరిని అనుమతించటం లేదు. రీ వ్యాల్యువేషన్, రీ వేరిఫికేషన్ కావాలంటే ఆన్ లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పి పంపిస్తున్నారు. కాగా, ప్రగతి భవన్‌తో పాటు గ్లోబరీనా సంస్థ ముట్టడికి ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. కలెక్టరేట్ల ముందు కూడా బీజేపీ నేతలు నిరసన తెలపనున్నారు.


ఇదిలాఉండ‌గా, కరీంనగర్ లోని మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని విద్యార్ధి సంఘాల నాయకులు ముట్టడించారు. ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంతో విద్యార్ధులు ఇబ్బందులు పెడుతున్నా..  ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బుధవారం ధర్నా చేపట్టారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఇంటర్ బోర్డు సెక్రటరీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు లేకుండా రి వాల్యుయేషన్ చేయాలని కోరారు.  పోలీసులు నచ్చచెప్పినా ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఇంటర్ బోర్డు అధికారులతో సమావేశమైన కమిటీ సభ్యులు.. బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చే అవ‌కాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: