రాజకీయాలు చివరకు ఎంతలా దిగజారిపోతాయో చెప్పడానికి ఇదొక అతి పెద్ద ఉదాహరణ. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంతలా దారుణమైన రాజకీయం మరొకటి జరిగి ఉండదేమో. ఎవరికైనా కావాల్సింది విలువైన వ్యక్తిత్వం. మరి ఎంతలా రాజకీయం చేస్తామని అనుకున్నా ఆ వ్యక్తిత్వాన్నే హననం చేస్తే. మనిషి మీదనే  మొత్తంగా బురద జల్లేస్తే.


తెలుగు రాజకీయాల్లొ జ‌గన్ లక్ష కోట్లు అన్నది సర్వ సాధారణమైన మాట అయిపోయింది. ఇది ఎంతలా ప్రచారంలోకి వచ్చిందంటే జగన్ లక్ష కోట్లను తినేశాడు అని ప్రతీ సామాన్యుడు నమ్మేంతలా. నిజానికి జగన్ మీద పెట్టిన కేసులేంటి, పూర్వ పరాలు ఏంటి అన్నవి ఎవరికీ అవసరం లేదు. జగన్ దొంగ అని టీడీపీ తమ్ముళ్ళు, ఎల్లో బ్యాచ్ మీడియా అదే పనిగా ఏళ్ళకు ఏళ్ళు ప్రచారం చేస్తే దాన్ని పట్టుకుని చదివిన వాళ్ళంతా ఈ నిర్ణయానికి వచ్చిన ఫలితం ఇది. నిజానికి 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ఇది ప్రధాన కారణం అయింది కూడా. అంటే ముఖ్యమంత్రి పీఠం చేజారిపోవడానికి ఈ అబద్దాలు ఎంత కారణం అయ్యాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.


ఇపుడు జనసేన విశాఖ ఎంపీ అభ్యర్ధి  అపుడు జగన్ మీద కేసులు ఫైల్ చేసిన జేడీ లక్ష్మీ నారాయణ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో 
మాట్లాడుతూ, జగన్ మీద పెట్టిన కేసులు కేవలం 1500 కోట్ల రూపాయలే అంటున్నారు. బాగానే ఉంది. ఆయన చెప్పినా కూడా ఇపుడు జనం నమ్మే పరిస్థితి లేకపోవడమే అసలైన విషాదం. అంతలా జగన్ మీద లక్ష కోట్ల ఆరోపణ చేయడంలో టీడీపీ పూర్తిగా విజయం సాధించింది. జగన్ వ్యక్తిత్వాని పూర్తిగా హత్య చేసేసింది. ఆయన పరువుని నిలువునా తీసేసింది. జగన్ అంటే లూటీకోర్ అన్న ముద్రని గొప్పగా వేసేసిన ఈ మీడియా. టీడీపీ రేపు జగన్ని కోర్టులు నిర్దోషి అని చెప్పినా శాంతించవు.


అయినా జగన్ కి జరగాల్సిన నష్టం ఇప్పటికే  బాగా జరిగిపోయింది. రాజకీయం అంటే ఇంతే, ఇష్టం వచ్చినట్లుగా బురద జల్లుతాం అంటూ తెగబడడమేనా అనిపించే ఘటన జగన్ విషయంలో జరిగింది. 2011లో జగన్ మీద కేసులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జగన్ అవినీతిపరుడు అని నమ్మేవారు కోట్లలో ఉండేలా చేసింది ఈ మీడియా. ఈ టీడీపీ. మచ్చ వేసినంత తేలిగ్గా దానిని తుడిచివేయగలరా 


నిజానికి న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయి. అంతవరకూ ప్రతీవారు నిందితులే. జగన్ కేసులను చూస్తే అవి బలంగా నిలబడేవి కావన్నది అందరూ అంటున్నదే. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు అయితే జగన్ పై పెట్టిన కేసులు ఏవీ నిలబడవని ఎపుడో చెప్పేశారు. అయినా లక్ష కోట్లు జగన్ అంటూ ఆయన్ని బదనాం చేసిన టీడీపీ  రాజకీయంగా చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఇపుడు జగన్ నిర్దోషిగా బయటకు వచ్చినా అయన మీద పడిన మచ్చ కానీ, ఆయన కుటుంబం మనో వేదన కానీ 16 నెలల విలువైన కాలం జైలు గోడల మధ్య మగ్గినది కానీ తిరిగి ఇవ్వలేరు. అంతే కాదు. 2014లో జగన్ సీఎం గా బంగారు అవకాశం కోల్పోయారు. దాన్ని కూడా ఇవ్వలేరు. 


ఇక్కడో గుణపాఠం అందరూ నేర్చుకోవాలి. రాజకీయాలు చేయండి. విమర్శలూ చేసుకోండి. కానీ అవి ఓ పరిధి దాటి వెళ్ళకుండా చూసుకోవాలి. అటు వైపు అయినా ఇటు వైపు అయినా ఇదే విధానంగా  ఉండాలి. ఎందుకంటే ఒకరి మీద బురద జల్లడం అతి సులువు. కానీ దాన్ని తుడిచివేయడం జరగని పని. విలువలతో కూడిన రాజకీయం చేస్తామని అంటారు. కనీసం కొంతలో కొంతైనా వాటిని పాటిస్తే అదే భావి తరాలకు అందించిన మేలు అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: