ఏపీలోని ప‌రిణామాల‌పై వైసీపీ ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హార‌శైలిని ప్ర‌స్తావిస్తూ....ఆయ‌న ఆస‌క్తిక‌ర ట్వీట్లు చేశారు. ``తుఫాను వస్తే ప్రజలను సీఎస్ రక్షిస్తారా అని యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది. ముందస్తు జాగ్రత్తల నుంచి సహాయ కార్యక్రమాల వరకూ ఎప్పుడూ పర్యవేక్షించేది జిల్లా కలెక్టర్లే కదా? గతంలో మీ సీఎం విదేశాల్లో ఉంటే సహాయ చర్యలు ఆగిపోయాయా? నిద్రలో కూడా వీళ్లకు సిఎస్ పీడకలగా వస్తున్నాడు`` అంటూ ఎద్దేవా చేశారు.


కాగా, టీడీపీ నేత‌లు సీఈఓ, సీఎస్‌ల ప‌ట్ల స్పందిస్తున్న తీరుపై విజ‌య‌సాయిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ``సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఈఓ ద్వివేదిల ఫోన్లు ఈ పాటికి ట్యాప్ చేసే ఉంటారు. వారిద్దరి పేషీల్లో ఉన్న తమ అనుకుల సిబ్బంది ద్వారా మినిట్-టు-మినిట్ సమాచారం సేకరిస్తూనే ఉండి ఉంటారు. అయినా ఈ అభద్రత ఏమిటో అంతుబట్టడం లేదు? అంత దోపిడీ చేశారా? తప్పించుకోలేని స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారా?`` అంటూ తెలుగుదేశం పార్టీ నేత‌ల తీరును త‌ప్పుప‌ట్టారు. 


రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై సైతం విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. ``ఏపీ రెవెన్యూ లోటు వచ్చే అయిదేళ్లలో 4.79 లక్షల కోట్లుంటుందని చంద్రబాబుగారి పత్రికలో రాశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే ‘సామాజిక ఆర్థిక మంత్రి’ అయిన కుటుంబరావును అడగాలా? లేక ‘నామమాత్ర ఆర్థిక మంత్రి’ అయిన యనమలను అడగాలా?`` అంటూ వ్యాఖ్యానించారు. ``ప్రభుత్వాధినేత అయి ఉండి ప్రతిదానికీ ప్రతిపక్షంపై నిందలు మోపడం మీకు సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ? స్ట్రాంగ్‌ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా, సీఎస్‌ రిటర్నింగ్‌ అధికారులతో సమీక్ష జరిపినా మాకేం సంబంధం. పోలింగ్ ముగిసేంత వరకు అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా?`` అంటూ ఇంకో ట్వీట్లో విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: