ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ విరుచుకుప‌డ్డారు.  పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ భగ్గుమన్నారు. మోదీకి దమ్ముంటే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేల్లో కనీసం ఒక్కరిని చూపించాలని సవాల్ చేశారు. మోదీ వ్యాఖ్యలపై హుగ్లీలో జరిగిన ప్రచార సభలో మమత స్పందించారు. వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోదీని షోలే సినిమాలోని గబ్బర్‌సింగ్‌తో పోల్చారు. నేతాజీ (సుభాష్ చంద్రబోస్) వంటి నేతలను అందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ మోదీ, గబ్బర్‌సింగ్ వంటి వారిని చూస్తే ప్రజలు భయపడతారు అని వ్యాఖ్యానించారు. 


కోల్‌కతాకు సమీపంలోని సీరంపూర్‌లో సోమవారం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ, దీదీ, మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మీ ఎమ్మెల్యేలు సైతం మిమ్మల్ని విడిచి పారిపోతారు. మీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు అని వ్యాఖ్యానించారు. దీనిపై మ‌మ‌త భ‌గ్గుమ‌న్నారు. ప్రధాని తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మ‌మ‌త‌ మండిపడ్డారు. ``మీకు సిగ్గు అనిపించడం లేదా? రాజ్యాంగ పరిరక్షకునిగా చెప్పుకోగలరా? ప్రధాన మంత్రిగా కొనసాగే హక్కు మీకు ఏమాత్రం లేదు`` అంటూ మమత మోదీని ఉద్దేశించి దుమ్మెత్తిపోశారు. తమ ఎమ్మెల్యేలందరినీ కొనుగోలుచేసినా తన ప్రభుత్వం పడిపోదని ధీమా వ్యక్తం చేశారు. మోదీ ముందుగా ఢిల్లీని కాపాడుకోవాలని, ఆ తరువాత బెంగాల్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చెప్పారు. 


``గత ఐదేండ్లలో ఆయన (మోదీ) ఏం చేశారు? రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది`` అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ ఎన్ని పగటి కలలు కన్నా సరే పశ్చిమ బెంగాల్‌లో కాలు మోపలేదని మమత స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై టీఎంసీ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఫిర్యాదు చేసింది. మోదీ ప్రసంగం తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడాన్ని సూచిస్తున్నదని తెలిపింది. ప్రధాని చేసిన ప్రకటనకు ఆధారాలపై మీరు (ఈసీ) ప్రశ్నించాలని కోరుతున్నాం. ఆధారాలు చూపకుంటే కోడ్ ఉల్లంఘించినందుకు తక్షణమే ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలి అని తృణమూల్ తమ లేఖలో డిమాండ్ చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: