ఐటీలో త‌మ‌ను మించిన వారెవ‌రూ లేర‌ని ప్ర‌కటించుకునే తెలుగు రాష్ట్రాల పెద్ద‌ల‌కు ఇది షాకింగ్ వంటి ప‌రిణామం. తెలుగు రాష్ట్రాలఫై హ్యాకర్లు పంజా విసిరారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ డిస్కంల‌లో వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. టీఎస్ఏస్పీడీసీఎల్ , టీఎస్ఎన్పీడీసీఎల్ , ఏపీఎస్పీడీసీఎల్ , ఏపీఈపీడీఎస్ఎల్ వెబ్ సైట్లు హ్యాక్ చేశారు. ర్యాన్సమ్ వెర్ వైరస్‌తో హ్యాకర్లు రెచ్చిపోయారు. అంతర్జాతీయ హ్యాకర్లు  డేటా హ్యాక్ చేసి , డిలీట్ చేసి 35 కోట్లు డిమాండ్ చేశారు. 


మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి కేంద్రంగా ఉమ్మడి ఏపీ నుంచే డిస్కంల వెబ్‌సైట్ల సర్వర్లను తిరుపతి నుంచి టీసీఎస్‌ నిర్వహిస్తోంది. తాజాగా రాన్సామ్ వేర్ ద్వారా ఈ స‌ర్వ‌ర్ల‌పై దాడి చేశారు. గుర్తుతెలియని మెయిల్స్‌ను తెరవగానే వీటి సర్వర్లలో వైరస్‌ చొరబడి వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసింది. సర్వర్ల నుంచి మొత్తం డేటాను డిలీట్‌ చేయడంతోపాటు వాటిని తెరుచుకోకుండా చేశారు. అయితే, డాటా బ్యాకప్ ఉండటంతో ముప్పు తప్పింది. డిస్కంల హ్యాకింగ్‌ఫై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద సైబ‌రాబద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఇదిలాఉండ‌గా, టీఎస్ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి  తమ సంస్థ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయినట్లు ధ్రువీకరించారు. టీసీఎస్‌ సంస్థ ఐటీ నిపుణులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కాగా, వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురికావడంతో 2 రోజులుగా ఆన్‌లైన్, పేటీఎం ద్వారా విద్యుత్‌ బిల్లుల చెల్లింపు స్తంభించిపోడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: