ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు గురించి వైసీపీ నేత సంచ‌ల‌న విష‌యం ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు చేస్తున్న కామెంట్ల‌ను పేర్కొంటూ ఆయ‌న  మాఫియాల‌ను ప్రోత్స‌హించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ నేత శ్రీ‌కాంత్ రెడ్డి మండిప‌డ్డారు. వైసీపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ, ఓటమి చెందుతున్నానని తెలిసి రకరకాల విన్యాసాలు చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. `క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారిపైనే కేసులు పెడుతుంటాం. నెల్లూరు ఎమ్మెల్యేను బెట్టింగ్ కేసులలో అన్యాయంగా ఇరికించారు.నానా రకాలుగా హింసించారు. అలాంటిది నిన్న చంద్రబాబు మాట్లాడుతూ బాంబేలో సట్టామార్కెట్ , మట్కా లాగే ఉంటుంది అందులో పందాలు కట్టండి. వారు మనకు ఫేవర్ గా ఉన్నారని స్వయంగా అన్నారంటే పరిస్దితి ఎంత దిగజారిందో తెలుసుకోవచ్చు.`` అని మండిప‌డ్డారు.


మాఫియా తన వెనక ఉందని చంద్ర‌బాబు సందేశం ఇచ్చారని శ్రీ‌కాంత్ రెడ్డి ఆరోపించారు. ``ముఖ్యమంత్రి సట్టామార్కెట్ గురించి టీడీపీ ఇన్ వాల్వ్ అవ్వాల‌ని పిలుపుఇచ్చారంటే...అది చ‌ట్ట‌రీత్యా నేరం కాబ‌ట్టి చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేయద్దు. చట్టాన్ని గౌరవించి చంద్రబాబుపై కేసు ఫైల్ చేస్తేనే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటుంది.`` అని ఆయ‌న అన్నారు. పదవి కాంక్షతో చంద్రబాబు దేనికైనా దిగజారుతున్నారని శ్రీ‌కాంత్ రెడ్డి మండిప‌డ్డారు. సీఎస్ నియామకాలలో కూడా చంద్రబాబు రాజకీయంగా విమర్శలు చేశారని ఆయ‌న గుర్తు చేశారు. ``దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి హయాంలో డీజీపీని బదిలీ చేస్తే హుందాగా వ్యవహరించారు. అదే ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలి చేస్తే చంద్రబాబు ప్రవర్తన ఎలా ఉందో అందరికి తెలిసిందే. ఈసీ పరిధిలోకి ఏబి వెంకటేశ్వరరావు రారని చెప్పారు. ఎన్నికల పరిధిలోకి వచ్చే డీజీపీపై వైఎస్సార్ కాంగ్రెస్ అనేక ఫిర్యాదులు ఇచ్చింది.ఈసి ఆయనపై ఎటువంటి చర్య తీసుకోలేదు. టిడిపి పట్ల సంతృప్తి శాతం పెంచండి అని పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావును బదిలీ చేస్తే ఈసి వైయస్సార్ కాంగ్రెస్ కుమ్మక్కైందని చంద్రబాబు ఆరోపించారు. ఆయనను బదిలీ చేస్తే రాధ్దాంతం చేశావు.అదే ఠాగూర్ ను బదిలీ చేయకపోతే మరి ఈసిని ఎందుకు ప్రశంసించడం లేదు.`` అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. 


ఈవీఎంలపై చంద్రబాబుకు నమ్మకం లేనప్పుడు ఎన్నికలకు ముందు ఎందుకు మాట్లాడలేదని శ్రీ‌కాంత్ రెడ్డి నిల‌దీశారు. ``పార్లమెంట్‌లో మీ ఎంపీలు ఎందుకు అడగలేదు? ఓటమికి సాకుల కోసమే ఈవీఎంలపై నానాయాగి చేస్తున్నారు. టీడీపీ ఓడిపోతుందని ఆరునెలల క్రితమే పసిగట్టారు. ఆక్టోపస్ అని త్వరలో ఒక వ్యక్తి వస్తారు.ఆయనను కూడా చంద్రబాబు దింపుతారు. తన అనుకూల ఛానల్స్ లో కూడా దొంగసర్వేలు ప్రకటిస్తారు. టీడీపీలో ఎవరు మిగలరు కాబట్టి ఉన్న కొద్ది మందిని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబూ ముఖ్యమంత్రి స్దాయిలో ప్రవర్తిస్తున్నావా?ఎక్కడన్నా అలా అనిపిస్తుందా? పార్టీలో తిరుగుబాటుకు భయపడి సట్టామార్కెట్ అని మరొకటని  చంద్రబాబు చెబుతున్నావు.``అని మండిప‌డ్డారు.త‌మ పాలనపై ప్రజలు ఓటేశారు అని పబ్లిక్ గా చెప్పలేని వ్యక్తి చంద్రబాబు అని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు గెలిచినా నేనే,ఓడిపోయినా నేనే అని ఎన్నికల ముందు ధైర్యంగా ప్రకటించార‌ని శ్రీ‌కాంత్‌ రెడ్డి గుర్తు చేస్తూ ఆ పని మీరు చేయగలరా అని ప్ర‌శ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: