తాజా మాజీ ఎంఎల్ఏ వల్లే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ ఓడిపోతోందని చంద్రబాబునాయుడుకు స్పష్టమైన సమాచారం ఉందట.  ఆరోపణలున్నాయని చంద్రబాబు మాజీకి టికెట్ ఇవ్వకపోతే టికెట్ దక్కించుకున్న అభ్యర్ధిని మాజీ దెబ్బకొట్టారట.  పోలింగ్ తర్వాత ఫీడ్ బ్యాక్ తీసుకున్న చంద్రబాబు ఇపుడు మాజీపై మండిపడుతున్నారని సమాచారం.

 

ఇంతకీ  విషయం ఏమిటంటే  పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలో చాలా కీలకం. ప్రాజెక్టు వల్ల నియోజకవర్గానికి బాగా ప్రధాన్యత పెరిగింది. మొన్నటి ఎన్నికల్లో బొరగం శ్రీనివాస్ కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు.  2014 ఎన్నికల్లో ముడియం శ్రీనివాస్ ఇక్కడ టిడిపి అభ్యర్ధిగా గెలిచారు.

 

అయితే గెలిచిన దగ్గర నుండి పార్టీ కార్యక్రమాలకన్నా ఎక్కువగా సొంత వ్యవహారాలకే ప్రాధాన్యత ఇచ్చుకున్నారట. ఎటూ పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి కదా కాంట్రాక్టర్లకు కొదవే ఉండదు. దాంతో పార్టీకి బాగా చెడ్డపేరొచ్చేసిందట. ఈ విషయం చంద్రబాబు దాకా వెళ్ళినపుడు పిలిచి మందలించారట. అయినా ముడియంలో మార్పు కనబడలేదట.

 

చేసేది లేక టికెట్ ఇచ్చే విషయంలో ఆలోచించాల్సొస్తుందని ఏడాది ముందుగా హెచ్చరించినా ఉపయోగం కనబడలేదట. దాంతో మండిపోయిన చంద్రబాబు చివరకు టికెట్ బొరగం శ్రీనివాస్ కు ఇచ్చేశారు. టికెట్ బొరగంకు ఇచ్చి గెలుపు బాధ్యతలు ముడియంకు అప్పగించారట. చంద్రబాబు దగ్గర తలూపి నియోజకవర్గానికి వచ్చిన తర్వాత బొరగం దగ్గర బాగానే పిండుకున్నారని సమాచారం.

 

బొరగం దగ్గర వీలున్నంతగా పిండుకున్న ముడియం చివరకు ప్రచారానికి కూడా పెద్దగా సహకరించలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వైసిపి అభ్యర్ధి తెల్లం బాలరాజు గెలుపుకు సహకరించారనే ప్రచారం కూడా ఉందిలేండి. ముడియం విషయం చంద్రబాబుకు చేరినా చేసేదేమీ లేక మాట్లాడకుండా కూర్చున్నారట. అందుకే సమీక్షల సందర్భంగా వచ్చే ముడియంను తనతో ప్రత్యేకంగా మాట్లాడాల్సిందిగా ఆదేశించారట. మొత్తానికి  ముడియం విషయంలో చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: