క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను అదే నిజమనిపిస్తోంది. మొదటినుండి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగటానికన్నా చంద్రబాబునాయుడు జేబులో మనిషిగా మసలుకోవటానికే పవన్ ఎక్కువ పాకులాడినట్లే కనిపిస్తుంది. నిజానికి రాష్ట్రంలో మూడో బలమైన పార్టీకి అవకాశం ఉంది. జనాలు కూడా టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయ శక్తి  రావాలనే కోరుకున్నారు. అయితే ప్రజల ఆకాంక్షలను తీర్చటంలో పవన్ విఫలమయ్యారనే చెప్పాలి.

 

నిజానికి 2014లొనే జనసేన రాజకీయ పార్టీ పోటీ చేసుండాల్సింది. అక్కడే పవన్ తప్పు చేశారు. ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా, రాజకీయాల్లోకి వచ్చినా అధికారం కోసమే అన్న విషయంలో అనుమానమే లేదు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని ఎవరు చెప్పినా జనాలు నమ్మరు. ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోకుండా పవన్ పదే పదే తాను సరికొత్త రాజకీయాలు చేస్తానని, అధికారం కోసం పార్టీ పెట్టలేదని ప్రకటించి జనాలు ముందు పలుచనైపోయాడు.

 

ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమని పవన్ చెప్పుకుంటున్నపుడు దానికి రాజకీయ పార్టీనే పెట్టాల్సిన అవసరం లేదు. ఏ స్వచ్చంధ సంస్ధో పెట్టుకునుంటే సరిపోయేది. ఇక రెండో తప్పు ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని చెప్పిన పవన్ ఏనాడు చంద్రబాబు తప్పులను ప్రశ్నించిన పానాన పోలేదు.  అవినీతి పెరిగిపోతున్నా, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినా,  మంత్రులు, ఎంఎల్ఏలు ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచేస్తున్నా పవన్ ఏనాడూ నోరిప్పలేదు. వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిలను చంద్రబాబు లాక్కుంటుంటే పవన్ ఏనాడు అభ్యంతరం చెప్పలేదు.

 

ఆవిర్భావ దినోత్సవమంటూ గుంటూరులో జరిగిన సభలో మొదటిసారి చంద్రబాబుకు వ్యతిరేకంగా పవన్ నోరిప్పారు. గుంటూరు సభలో చంద్రబాబు, లోకేష్ అవినీతి గురించి పవన్ మాట్లాడటంతో జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డారు. కొద్ది రోజులు పవన్ అదే ఒరవడి కంటిన్యు చేయటంతో జనాల్లో ప్రత్యామ్నయశక్తిగా పవన్ నిలబడుతున్నాడనే అనుకున్నారు. కానీ జనాలు అనుకున్నన్ని రోజులు పట్టలేదు జావకారిపోవటానికి.

 

అటు తిరిగి ఇటు తిరిగి చివరకు చంద్రబాబు జేబులోకే చేరారు పవన్. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉంటూ మరో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకున్న ఏకైక నాయకుడు పవన్ మాత్రమే. దాంతో తాను ప్రజాపక్షమని పవన్ చెప్పుకోవటాన్ని ఎవరూ నమ్మలేదు. చివరకు ఎన్నికల్లో కూడా చంద్రబాబు కోసం జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు పవన్ ప్లాన్ చేసిన విషయాన్ని జనాలు అర్ధం చేసుకున్నారు. పవన్ గనుక చంద్రబాబు, జగన్ కు ప్రత్యామ్నాయంగా నిలబడుంటే జనేసేనకు జనాలు ఎన్నికల్లో మద్దతిచ్చేవారేనేమో? కానీ పవన్ తన నెత్తిన తానే చెత్త వేసుకున్నారనే చెప్పాలి. అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలుండవు అంతా ఆత్మహత్యలే అని.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: