తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు ప‌ద‌వుల జాత‌ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారా?  కీక‌ల‌మైన నామినేటెడ్ ప‌ద‌వుల‌ విష‌యంలో త్వ‌ల‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని గులాబీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు పార్టీ శ్రేణులలో జోరుగానే చర్చ జరుగుతోంది. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు స్థానిక ఎన్నికలలో విజయమే గీటురాయిగా పదవుల పంపకం ఉంటుందని గులాబీ దండు భావిస్తోంది.


పరిషత్ ఎన్నికలు పూర్తయిన అనంత‌రం ప‌ద‌వుల పందేరం ఉంటుంద‌ని తెలుస్తోంది. ప‌రిష‌త్ పోరుతో వ‌చ్చే 32 జడ్పీ చైర్మన్లను ప్రకటించిన రాష్ట్రస్థాయి పదవుల పంపకం కోసం కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. మంత్రి పదవులు దక్కని మరి కొందరికి కేబినెట్ ర్యాంకు కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదువులు ఇస్తారని అంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఇందులో న్యాయపరంగా ఎలాంటి చిక్కులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. పార్లమెంటరీ కార్యదర్శులు ఉన్న రాష్ట్రాలలో ఈ మేరకు అధ్యయనం చేయించారని అంటున్నారు. అలాగే ఇప్పటికే కార్పొరేషన్ పదవులలో ఉన్నవారిలో మార్పులు, చేర్పులు జరుగుతాయని అంటున్నారు.


వాస్త‌వానికి టీఆర్ఎస్ నేత‌లు ప‌ద‌వుల కోసం ఎదురుచూస్తున్నారు. ముందునుంచీ పార్టీలో ఉన్నవారే కాకుండా, కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారూ ఉన్నారు. వారంతా తమకు ఏదో ఒక పదవి లభించకపోతుందా అని ఆశ పడుతున్నారని అంటున్నారు. అలా తాము హామీ ఇచ్చిన వారికి, తాము ఎంపిక చేసుకున్నవారికి కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో ఎలాంటి అసంతృప్తులకూ తావు లేకుండా చూడాలని అనుకుంటున్నట్టు తెలిసింది. దీంతో పాటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు, ఈసారి ఇద్దరు మహిళలకు తప్పనిసరిగా మంత్రివర్గంలో చోటు ఉంటుందని చెబుతున్నారు. స్థూలంగా, ఎన్నికలకు ముందు కేసీఆర్ నుంచి, కేటీఆర్ నుంచి హామీలు పొందిన చాలా మంది పదవుల కోసం ఎదురు చూస్తున్న  నాయకుల కోరిక త్వ‌ర‌లోనే నెర‌వేర‌నుంద‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: