ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈసీతో ఢీకొట్టి మ‌రీ తుఫానుపై స‌మీక్షించే విష‌యంలో వాగ్యుద్ధాన్ని చంద్ర‌బాబు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీనికి తోడుతగా త్వ‌ర‌లో కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై తాజాగా వైసీపీ నేత వాసిరెడ్డి ప‌ద్మ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు కేబినెట్ స‌మావేశం పెడతాననడం హాస్యాస్పదమ‌ని అన్నారు. కేబినెట్ లో ఏం నిర్ణయాలు తీసుకుంటారని ఆమె సూటిగా ప్ర‌శ్నించారు.


చంద్ర‌బాబు కేబినెట్ మీటింగ్ వెనుక ఉద్దేశం ఏంట‌ని ప‌ద్మ ప్ర‌శ్నించారు. ``రైతులకు రుణమాఫి అని చెప్పి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారా? ఐదు నెలలుగా కొందరు ఉద్యోగులకు ఇవ్వని జీతాలను మంజూరు చేసి ఇచ్చేస్తారా? క్యాబినెట్ సమావేశానికి ఎవర్ని పిలుస్తున్నారు....మంత్రులందరూ కూడా తలో చోట దాక్కుంటున్నారు.చంద్రబాబు..ఆయన చెంచాలు తప్ప మరెవరు కనబడటం లేదు. ఆర్థిక మంత్రిగా యనమలను పిలుస్తున్నారా లేక కుటుంబరావును పిలుస్తున్నారా? హోంమంత్రి చినరాజప్పను పిలుస్తున్నారా లేక ఏబి వెంకటేశ్వరరావును పిలుస్తున్నారా? ఇరిగేషన్ మంత్రి దేవినేనిని పిలుస్తున్నారా లేక రాయపాటిని పిలుస్తున్నారా? ఐటీ శాఖమంత్రి లోకేష్ ను పిలుస్తున్నారా లేక ఈవిఎంల దొంగ హరిప్రసాద్ ను పిలుస్తున్నారా`` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.


త‌మ స‌మావేశాల‌కు సీఎస్ రావడం లేదని చంద్ర‌బాబు సందేహం వ్య‌క్తం చేయ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు.``సీఎస్ అంటే మీకు ఎందుకు భయం? మీ దగ్గర ఐదుగురు సీఎస్‌లు పనిచేస్తే ముగ్గురు పంటికింద రాయిగా మారారంటే మీ పాలన ఎలా ఉందో అర్దమవుతుంది. నా పాపాలు ఏవి కూడా బయట కూడదనే తాపత్రయం మీలో కనబడతోంది. చంద్రబాబు చేష్టలు చూసి టిడిపి శ్రేణులో నవ్వుకుంటున్నాయి.``అని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: