ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రిపై తిరుగుబాటు...ఎమ్మెల్యేల‌నే గౌర‌వం సంగ‌తి త‌ర్వాత‌. త‌మ‌కు ద్రోహం చేశార‌ని ఆవేశం ముందు అదేమీ క‌నిపించ‌డం. ఒకే ఉమ్మ‌డి జిల్లాలోనే, ఒకే పార్టీ త‌ర‌ఫున గెలిచిన పార్టీ వ‌దిలి మ‌రో పార్టీలో చేరిన‌ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌లు ప్ర‌తిఘ‌టించారు. దీంతో ఈ ఎపిసోడ్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. జంపింగ్ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్ష‌న్ మొదలైంద‌ని అంటున్నారు.


కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై శ‌నివారం కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లదాడికి యత్నించిన సంఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ మ‌రుస‌టి రోజే, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఇదే ప‌రాభ‌వం ఎదురైంది. ఆయ‌న‌కు ఇవాళ ప్రజలు ఎదురుతిరిగారు. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి కాంతారావు ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా..ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయమని చెప్పి.. ఇప్పుడు ఆ గుర్తుకు ఓటు వేయకుండా కారు గుర్తుకు వేయాలని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈక్రమంలో ఎమ్మెల్యే అనుచరులకు, గ్రామస్థులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకోవడంతో కాంతారావు అక్కడి నుంచి వెనుదిరిగారు.


పరిషత్‌ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వరుసగా షాక్‌ తగులుతోంది. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రికి నిరసన సెగ త‌గులుతుండ‌టంతో...ఇదే ప‌రిస్థితి తెలంగాణ‌లోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు విస్త‌రిస్తే ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌ల చేతుల్లో షాక్ ఖాయ‌మా అనే చ‌ర్చ సైతం తెర‌మీద‌కు వ‌స్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: