ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బీహార్‌లో శ‌నివారం ప్ర‌ధాని మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు మాట్లాడుకునే ప‌రిస్థితి లేద‌ని చేసిన వ్యాఖ్యలపై ఇవాళ విలేకరుల సమావేశంలో బాబు స్పందించారు. మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని తెలిపారు. ఆంధ్రా ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలన్న బాబు.. ఏపీ విషయంలో బీజేపీ శాశ్వత ద్రోహిగా మిగిలిపోతుందని ఆరోపించారు.


ఏపీ గురించి మాట్లాడే అర్హత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేదని.. సందర్భం లేకుండా ఏపీ గురించి మోదీ మాట్లాడడం వెక్కిరింపు చర్యేనని మండిప‌డ్డారు. విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్నీ పట్టించుకోలేదని, 98 శాతం హామీలు నెరవేర్చామని మోదీ చెప్పడం దారుణమని అన్నారు. ప్రధాని మోదీకి ప్రాథమిక విషయాలు కూడా తెలియవని విమర్శించారు. మోదీ మాటలకు, చేతలకు సంబంధం లేదని అన్నారు. ఏ సమస్యను ప్రధాని పరిష్కరించ లేదని... ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. 'ఇంతకముందు ఏర్పడిన రాష్ట్రాకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. కేంద్రం కూడా సహకరించింది. కానీ ఇక్కడ జరిగింది అదికాదు. రాజధాని ఉన్న ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా కోరుకున్నారు. ఆ 3 రాష్ట్రాల విభజన వేరు, ఇది వేరు' అని అన్నారు.


ఐదేళ్లలో ఏపీకి మోదీ ఏం చేయలేదని చంద్ర‌బాబు విమర్శించారు. ఏపీ విభజనలో బీజేపీ భాగస్వామ్యం ఉందని, కేంద్రం పెద్దన్న పాత్ర పోషించివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బాబు అన్నారు. రెండు రాష్ట్రాలకూ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రధానికి లేదా? అని ప్రశ్నించిన ఆయన.. సన్ రైజ్ స్టేట్ బ్రాండ్ ను  వక్రీకరించడం సరికాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: