తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్ గురించి రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో స‌ర్వం కేసీఆర్ అయితే, ఆయ‌న త‌ర్వాత అధికారం అంతా కేటీఆర్‌ది అనే సంగ‌తి తెలిసిందే. అలాంటి హోదాలో ఉన్న కేటీఆర్‌..తాజాగా పార్టీలోని ప‌రిణామాల‌పై ఆవేద‌న చెందుతున్నారట‌. పార్టీ నేత‌లు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై నారాజ్ అవుతున్నార‌ని తెలుస్తోంది. అందుకే ఆయ‌న గ‌త కొద్దిరోజులుగా ఎవ‌రితో క‌ల‌వ‌డం లేద‌ని అంటున్నారు. ఇంట‌ర్ ఫ‌లితాల ఎపిసోడ్‌ను లింక్ పెట్టి ఈ విశ్లేష‌ణ చేస్తున్నారు.

ఇంట‌ర్ ఫ‌లితాల్లో పెద్ద ఎత్తున గంద‌ర‌గోళం నెల‌కొన‌డం, దాదాపు 20 మంది విద్యార్థులు మ‌ర‌ణించ‌డం, ఇంట‌ర్ ఫ‌లితాల ప్ర‌క్రియ‌లో భాగ‌స్వామ్యం పంచుకున్న గ్లోబ‌రినా సంస్థ‌పై విమ‌ర్శ‌లు ముస‌ర‌డం, ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా స్పందించ‌డం తెలిసిందే. పీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌  రేవంత్‌‌ రెడ్డి అయితే సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. దీంతో మే డే వేడుకల్లో కేటీఆర్‌‌ తనకు గ్లోబరీనాతో సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు . రూ.10 వేల కోట్ల స్కాం చేసినట్టు రేవంత్‌‌ ఆరోపించడంపై కేటీఆర్‌‌  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4.30 కోట్ల టెండర్‌‌కు రూ.10 వేల కోట్ల లంచమిస్తారా అని ప్రశ్నించారు.అదే  వేదికపై నుంచి కాంగ్రెస్‌‌ సీనియర్‌‌ నేత వీహెచ్‌పై విరుచుకుపడ్డారు.


అయితే, ఇంత జ‌రిగినా...త‌నపై వ‌చ్చిన ఆరోపణలను ఓ ఎమ్మెల్యే, ఓ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ మినహా ఎవరూ ఖండించకపోవడంపై కేటీఆర్ నారాజ్ అయిన‌ట్లు స‌మాచారం.  గ్లోబరీనా విషయంలో వచ్చిన ఆరోపణలను తనకు మాత్రమే పరిమితమైనవి అన్నట్టు మంత్రులు, నేతలు వ్యవహరించడాన్ని కేటీఆర్‌‌ తప్పుబడుతున్నట్టు సమాచారం. తనపై  కాంగ్రెస్‌‌ నేతలు చేసిన ఆరోపణలను తానే ఖండించుకోవాలా అని కొందరు సన్నిహితుల వద్ద కేటీఆర్‌‌  ప్రస్తావించినట్టుగా తెలిసింది.మంత్రులు, ఇతరనేతల తీరుతోనే కేటీఆర్‌‌ రెండు, మూడు రోజులుగా బయటికి రావడం లేదని, ఎవరితోనూ మాట్లాడటం లేదని ప్ర‌చారం జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: